![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా 'అన్నాత్తే'కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన లేడీ సూపర్‌స్టార్ నయనతార ఆ సినిమా సెట్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నయనతార ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైట్ షర్ట్, జీన్స్ ధరించి, బన్‌తో హెయిర్‌ను బిగించి కట్టి, ముఖానికి వైట్ మాస్క్, కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని, గార్జియస్‌గా ఆ ఫొటోల్లో మెరిసిపోతోంది నయన్.
ఇదివరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు వేసిన రజనీకాంత్, ఆ వెంటనే హైదరాబాద్‌కు వచ్చేసి, 'అన్నాత్తే' షూటింగ్‌లో జాయిన్ అయిపోయారు. హైదరాబాద్‌కు వచ్చే ముందు చెన్నై శివార్లలో కొన్ని సన్నివేశాలను యూనిట్ చిత్రీకరించింది. గత ఏడాది లాక్‌డౌన్ విధించక ముందే 'అన్నాత్తే' షూటింగ్ 60 శాతం పూర్తయింది. లాక్‌డౌన్ ముగిసి, కొన్ని నిబంధనలు సడలించాక షూటింగ్‌ను యూనిట్ పునరుద్ధరించింది. అయితే డిసెంబర్‌లో కొంతమంది సిబ్బంది కొవిడ్-19 బారినపడటంతో మళ్లీ షూటింగ్‌కు ఆటంకం కలిగింది.
శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రజనీకాంత్, మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, సూరి, సతీశ్ కీలక పాత్రధారులు. సినిమాటోగ్రాఫర్ నుంచి తెలుగు హిట్ మూవీ శౌర్యంతో డైరెక్టర్‌గా మారిన శివ, తర్వాత కాలంలో అజిత్ హీరోగా వరుసగా నాలుగు హిట్ సినిమాలు.. వీరమ్, వేదాళమ్, వివేగమ్, విశ్వాసమ్.. రూపొందించాడు. 'అన్నాత్తే' మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మిస్తున్నారు.
![]() |
![]() |