![]() |
![]() |

కార్తికేయ హీరోగా నటించిన 'చావు కబురు చల్లగా' మూవీ మార్చి 19న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నమోదైంది. కౌశిక్ పెగళ్లపాటి అనే కొత్త డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తే, జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించాడు. విడుదలకు ముందు మంచి బజ్‌నే సాధించిన ఈ సినిమా, విడుదలయ్యాక ఆడియెన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.
తన స్వర్గపురి వాహనములో శవాలను శ్మశానానికి తరలించే బస్తీ బాలరాజు అనే క్యారెక్టర్‌లో కార్తికేయ నటించాడు. నర్సుగా పనిచేసే మల్లిక (లావణ్యా త్రిపాఠి) భర్త చనిపోతే, ఆ శవాన్ని తీసుకెళ్లడానికి వచ్చి, శవం ముందు రోదిస్తున్న మల్లికతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు బాలరాజు. అప్పట్నుంచే ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడి, వేధిస్తాడు. చివరకు కథ సుఖాంతమవుతుంది. అయితే భర్తపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న యువతిని ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటాననీ వెంటపడటమనే పాయింట్ ప్రేక్షకులకు మింగుడు పడలేదు. దానికితోడు బాలరాజు తల్లిగా నటించిన ఆమని క్యారెక్టర్ కూడా వాళ్లకు చికాకు తెప్పించింది. అందుకే థియేటర్లలో ఆ సినిమా ఫెయిలైంది.
చిత్రంగా ఆ సినిమా ఓటీటీలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇటీవల 'చావు కబురు చల్లగా' మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ చేశారు. స్ట్రీమింగ్ అయిన 72 గంటల్లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్‌షిప్‌ను ఈ సినిమా అందుకుందని ఆహా సగర్వంగా ప్రకటించింది. ఓటీటీ ఆడియెన్స్ కోసం ఈ సినిమాని మళ్లీ ఎడిట్ చేసి, రిలీజ్ చేశారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఏ సీన్లు అయితే ఎక్కువ ఇబ్బందిగా అనిపించాయో వాటిని కత్తిరించేశారు. థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో వీక్షకాదరణ పొందుతున్నందుకు కార్తికేయ హ్యాపీగా ఫీలవుతున్నాడు.
![]() |
![]() |