![]() |
![]() |

ఫోన్‌లో బాంబు బెదిరింపులు రావడంతో చెన్నైలోని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి గురువారం పోలీస్ అధికారుల బృందం, బాంబ్ స్క్వాడ్ పరుగున వెళ్లారు. అయితే, ఆ తర్వాత ఆ ఫోన్ కాల్ ఉత్తదని స్పష్టమైంది. ఉదయం 10.30 గంటలకు 108 అంబులెన్స్ కంట్రోల్ సెంటర్‌కు ఒక ఆకతాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పొయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంట్లో బాంబులు పెట్టారని చెప్పిన ఆ వ్యక్తి, ఆ వెంటనే కాల్‌ను డిస్కనెక్ట్ చేశాడు.
కరోనా మహమ్మారి కారణంగా రజనీ కుటుంబ సభ్యులంతా ఇంటి లోపలే ఉన్నారు. ఇంట్లో తనిఖీ చేయడానికి పోలీసులను మొదట వాళ్లు అనుమతించలేదు. తమ పని చేసుకోనివ్వాల్సిందిగా పోలీసులు వాళ్లను అభ్యర్థించారు. అలా 10 నిమిషాలు వాళ్లు బయటే వేచి చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ రజనీ కుటుంబసభ్యలు వారిని లోనికి రానివ్వలేదు. చేసేది లేక వాళ్లు సీనియర్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఇచ్చిన సలహా మేరకు అక్కడి సెక్యూరిటీ గార్డ్ కేబిన్‌ను, రజనీ ఇంటి చుట్టూ నిశితంగా తనిఖీ చేసి, ఆ తర్వాత పోలీసుల బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అనంతరం బాంబు బెదిరింపు కాల్ ఒక ఆకతాయి చేసిన పని అనీ, అది ఉత్తుత్తి బెదిరింపు అనీ పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఉదంతంపై రజనీ ఇంటి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఫోన్ చేసిన ఆకతాయిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
![]() |
![]() |