![]() |
![]() |

బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య అని శవపరీక్ష చేసిన వైద్యులు నిర్ధారణ చేశారు. అయితే, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా తనకు తానుగా స్వంత ప్రతిభతో పైకి ఎదిగిన సుశాంత్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది మిస్టరీగా మారింది. కొన్ని నెలలుగా అతడు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చినప్పటికీ.... అతడి మానసిక కుంగుబాటుకు కారణమైన మూల వ్యక్తులు ఎవరనే చర్చ బాలీవుడ్ ఇండస్ట్రీలో బలంగా జరుగుతోంది.
చెత్త సినిమా 'గల్లీ బాయ్స్'కి అవార్డులు ఇచ్చి, సుశాంత్ నటించిన చక్కటి సందేశాత్మక చిత్రం 'చచ్చోరె'కి అవార్డులు ఇవ్వకుండా అతడి ప్రతిభను బాలీవుడ్ బడా బాబులు తొక్కేశారని కంగనా రనౌత్ ఆరోపించారు. ఎటువంటి నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమలో సొంతంగా ఎదిగిన వాళ్లను హిందీ ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారనీ, బాలీవుడ్ బడా బాబుల కారణంగా ఏర్పడిన మానసిక ఒత్తిడితో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె మండిపడ్డారు.
తెలుగులోనూ హీరోయిన్లుగా సినిమాలు చేసిన, చేస్తున్న పాయల్ ఘోష్, స్నేహా ఉల్లాల్, పాయల్ రాజ్‌పుత్ తదితరులది ఇంచుమించు ఇదే వాదన. బంధుప్రీతి, బాలీవుడ్ పెద్దలు పైకి ఎదగనివ్వకుండా తొక్కేయడంతో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ చేసిన ట్వీట్స్ చూస్తుంటే... బాలీవుడ్ బడా బాబుల మెడకు సుశాంత్ కేసు చుట్టుకుంటుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పోస్టుమార్టం రిపోర్టులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నప్పటికీ... మీడియాలో ప్రొఫెషనల్ రైవలరీ (వృత్తిపరమైన శత్రుత్వం) వలన మానసిక కుంగుబాటుకు గురై ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తారని మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు. దాంతో పోలీసులు హిందీ ఇండస్ట్రీలో ఎవరెవరిని విచారిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |