![]() |
![]() |

ఒక దశలో వరుస విజయాలతో తెలుగునాట స్టార్ హీరోయిన్‌గా రాణించింది శ్రుతి హాసన్. అయితే ‘కాటమరాయుడు’(2017) తరువాత మాత్రం ఎందుకనో టాలీవుడ్‌పై శీతకన్నేసింది శ్రుతి. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ‘క్రాక్’లో నటిస్తూ రీ-ఎంట్రీకి రెడీ అయింది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ కాప్ స్టోరీ.. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే మిగిలిన భాగానికి సంబంధించిన చిత్రీకరణ పునఃప్రారంభించనున్నారు. ‘క్రాక్’తో పూర్వ వైభవాన్ని పొందుతానన్న ధీమాతో ఉంది శ్రుతి.
ఇదిలా ఉంటే.. శ్రుతి హాసన్ కంటే ముందు పలువురు అగ్ర కథానాయికలు రవితేజ సినిమాలతోనే తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చిన వైనముంది. ఆ తారలే.. స్నేహ, శ్రియ, ఇలియానా. కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. ‘ప్రియమైన నీకు’(2001)తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైన స్నేహ.. అదే ఏడాది చివరలో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’తో బ్లాక్‌బస్టర్ అందుకుంది. చిత్రంగా ఆ తరువాత మాత్రం రెండేళ్ళ పాటు తెలుగుతెరకు దూరమైంది. కట్ చేస్తే.. మళ్ళీ ‘వెంకీ’(2004)తో రీ-ఎంట్రీ ఇచ్చింది. రవితేజ కథానాయకుడుగా నటించిన ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో తెలుగునాట స్నేహ హవా మొదలైంది. ‘వెంకీ’ విజయంతోనే వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ సరసన వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది స్నేహ.
ఇక శ్రియ విషయానికొస్తే.. ‘భగీరథ’(2005) (ఇందులో రవితేజ కథానాయకుడు) తరువాత అన్య భాషా చిత్రాలపై దృష్టి సారించిన ఈ అమ్మడు.. మళ్ళీ రవితేజ చిత్రం ‘డాన్ శీను’(2010)తోనే తెలుగునాట ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్‌లో దర్శనమిచ్చింది. మధ్యలో అనువాద చిత్రాలతోనూ, అతిథి పాత్రలతోనూ, ప్రత్యేక గీతాలతోనూ సందడి చేసింది. ‘డాన్ శీను’ విజయంతో మళ్ళీ తెలుగు చిత్రాలపై దృష్టి సారించిన శ్రియ.. ఇప్పటికీ ఏదో ఒక క్రేజీ ప్రాజెక్టులో కనిపిస్తూనే ఉండడం గమనార్హం. ఇక స్నేహ, శ్రియ బాటలోనే మరో స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా రవితేజ సినిమాతోనే తెలుగునాట రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం. రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’(2012) తరువాత హిందీ చిత్రాలపై దృష్టి సారించిన ఇలియానా.. మళ్ళీ అదే రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’(2018)తో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. గ్యాప్ తరువాత వచ్చినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని మురిపించింది.
మొత్తమ్మీద.. రీ-ఎంట్రీ ఇవ్వాలనుకునే స్టార్ హీరోయిన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు రవితేజ. అలా.. రీ-ఎంట్రీ ఇస్తున్న కథానాయికల్లో సింహభాగం పునరాగమన చిత్రాలతో విజయాలు అందుకుంటూ.. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుండడం వార్తల్లో నిలుస్తోంది. మరి.. స్నేహ, శ్రియలాగే శ్రుతి కూడా రవితేజ సమేతంగా రీ-ఎంట్రీ హిట్‌ని అందుకుంటుందేమో చూడాలి. అలాగే.. మున్ముందు ఈ జాబితాలో మరెంతమంది కథానాయికలు చేరతారో అన్నది కూడా ఆసక్తికరమే.
![]() |
![]() |