![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మేలిమలుపుగా నిలిచిన చిత్రం `సింహాద్రి`. `స్టూడెంట్ నెం.1` (2001) వంటి విజయవంతమైన సినిమా తరువాత తారక్ - దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. టాలీవుడ్ గత రికార్డులను భూస్థాపితం చేసి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. అటు వసూళ్ళపరంగానూ, ఇటు కేంద్రాల పరంగానూ సంచలనం సృష్టించి.. పిన్నవయసులోనే `ఇండస్ట్రీహిట్`ని చూసిన కథానాయకుడిగా ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా నిలిపిందీ చిత్రం. అనాథ అయిన తనని చేరదీసి, పెంచిన కుటుంబం కోసం ఎంతకైనా తెగించే యువకుడి కథతో `సింహాద్రి` తెరకెక్కింది. స్టోరీలైన్ సింపుల్ గా అనిపించినా.. దాన్ని జక్కన్న తెరకెక్కించిన విధానం - సింహాద్రి, సింగమలైగా రెండు ఛాయలున్న పాత్రలో తారక్ జీవించిన తీరు.. `సింహాద్రి`ని మరోస్థాయికి తీసుకెళ్ళాయి.
స్వరవాణి కీరవాణి బాణీలు - నేపథ్య సంగీతం `సింహాద్రి`కి మరో మెయిన్ ఎస్సెట్. ``నువ్వు విజిలిస్తే``, ``చిన్నదమ్మే చీకులు``, ``నన్నేదో సేయమాకు``, ``చీమ చీమ``, ``చిరాకు అనుకో``, ``అమ్మైనా నాన్నైనా``, ``సింగమలై``.. ఇలా ఇందులోని ప్రతీ పాట విశేషాదరణ పొందింది. ఇక తారక్ నృత్యాలు సరేసరి.
భూమికా చావ్లా, అంకిత నాయికలుగా నటించిన `సింహాద్రి`లో నాజర్, భానుచందర్, సీత, సంగీత, బ్రహ్మానందం, అలీ, రాహుల్ దేవ్, శరత్ సక్సేనా, ముకేశ్ రిషి, వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రమ్యకృష్ణ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. తమిళ, కన్నడ, బంగ్లాదేశీ భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది. వి. దొరస్వామిరాజు సమర్పణలో వి. విజయ్ కుమార్ వర్మ నిర్మించిన `సింహాద్రి`.. 2003 జూలై 9న విడుదలై కాసుల వర్షం కురిపించింది. నేటితో ఈ సినిమా 18 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |