![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు - దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో చిరస్థాయిగా నిలిచే చిత్రం `బొబ్బిలి పులి`. అవినీతిపై యుద్ధం ప్రకటిస్తూ రూపొందిన `భారతీయుడు`, `ఠాగూర్`, `అపరిచితుడు` వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి స్ఫూర్తిగా నిలిచిన సినిమాగానూ `బొబ్బిలి పులి` నిలుస్తుంది. అంతేకాదు.. సమాజంలోని అవినీతిని ఎండగట్టి, ప్రజల్లో ఎంతోకొంత చైతన్యాన్ని తీసుకురావడంలో దోహదపడిన చిత్రాల్లో `బొబ్బిలి పులి` ప్రథమ శ్రేణిలో ఉంటుంది. 100కి పైగా కేంద్రాలలో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కిన `బొబ్బిలి పులి`.. రూ. 3.5 కోట్లకి పైగా వసూళ్ళు ఆర్జించి అప్పట్లో సంచలనం సృష్టించింది.
దేశసరిహద్దుల్లో వందలాది మంది శత్రుసైనికులను తుదముట్టించి `మహావీరచక్ర` బిరుదు పొందిన మేజర్ చక్రధర్.. సెలవుల్లో ఇంటికి వచ్చి విజయని ప్రేమిస్తాడు. తనని పెళ్ళాడాలనుకుంటాడు. ఇంతలో సమాజంలోని దుర్మార్గులను చూస్తాడు. దేశాభివృద్ధికి అడ్డుపడుతున్న ఆ అంతర్గత శత్రువులపై పోరాడతాడు. ఈ నేపథ్యంలో.. చక్రధర్ కి ఎదురయ్యే అనుభవాల నేపథ్యంలో `బొబ్బిలి పులి` నడుస్తుంది.
ఎన్టీఆర్ కి జంటగా శ్రీదేవి నటించిన ఈ సినిమాలో రావుగోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, మురళీ మోహన్, ప్రభాకర్ రెడ్డి, రాజనాల, జయచిత్ర, అంబిక, పుష్పలత ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, సుభాషిణి ప్రత్యేక గీతంలో మెరిశారు. హిందీలో `జఖ్మీ షేర్` (జితేంద్ర, డింపుల్ కపాడియా) పేరుతో ఈ సినిమాని దాసరినే రూపొందించడం విశేషం.
జేవీ రాఘవులు సంగీతమందించిన ఈ చిత్రంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``జననీ జన్మభూమిశ్చ``, ``అది ఒకటో నంబర్ బస్``, ``తెల్లా తెల్లని చీరలోన``, ``ఎడ్డమంటే``, ``సంభవం``, ``ఓ సుబ్బారావు``.. ఇలా ఇందులోని గీతాలన్ని అలరించాయి. విజయమాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేశ్ నిర్మించిన `బొబ్బిలిపులి``.. 1982 జూలై 9న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ సంచలన చిత్రం.. 39 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |