![]() |
![]() |

`చంటి` (1992) వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత విక్టరీ వెంకటేశ్ - స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం `కొండపల్లి రాజా`. తమిళ చిత్రం `అణ్ణామలై` (సూపర్ స్టార్ రజినీకాంత్, ఖుష్బూ, శరత్ బాబు) ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో వెంకీకి స్నేహితుడి పాత్రలో సుమన్ నటించగా.. వెంకటేశ్ కి జంటగా నగ్మా దర్శనమిచ్చారు. చిన్నప్పటినుంచి మంచి స్నేహితులైన రాజా(వెంకటేశ్), అశోక్(సుమన్).. అశోక్ తండ్రి (కోట శ్రీనివాసరావు) కారణంగా విడిపోతారు. చివరికి మిత్రులిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? అనేదే `కొండపల్లి రాజా` కథాంశం.
శ్రీకాంత్, కెప్టెన్ రాజు, అలీ, సుజాత, సుధాకర్, యువరాణి, రేఖ, అర్చనా పూరన్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించారు. కె. రవీంద్రబాబు ఛాయాగ్రహణం అందించారు.
స్వరవాణి కీరవాణి బాణీలతో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. టైటిల్ సాంగ్ తో పాటు ``దానిమ్మ తోటలో``, ``సింగరాయ కొండ``, ``అమ్మమ్మమ్మో``, ``ఏ కాశిలో సిగ్గు``, ``గువ్వమ్ గుడుగుడు``.. ఇలా ఇందులోని గీతాలన్ని అలరించాయి. సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కేవీవీ సత్యనారాయణ నిర్మించిన `కొండపల్లి రాజా`.. 1993 జూలై 9న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం 28 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |