![]() |
![]() |

మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించిన సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. కానీ 'ఆచార్య'కు ఎందుకనో రావాల్సినంత హైప్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. పోనీ విడుదల తర్వాత టాక్ ని బట్టి కలెక్షన్స్ భారీగా పెరుగుతాయేమో అనుకుంటే మొదటి షో నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆచార్య ఫస్ట్ డే కలెక్షన్స్ ఊహించిన దానికంటే తక్కువగా వచ్చాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'ఆచార్య'కు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో హైర్స్ తో కలిపి రూ.29.50 కోట్ల షేర్ వచ్చింది. 10.81 కోట్ల హైర్స్ తీసేస్తే 18.69 కోట్ల షేర్ మాత్రమే రావడం విశేషం. చిరంజీవి గత చిత్రం 'సైరా నరసింహారెడ్డి'.. తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే హైర్స్ తీసేస్తే 24.72 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ 'భీమ్లా నాయక్'కి హైర్స్ తీసేస్తే 22.73 కోట్ల షేర్ వచ్చింది.
'సైరా', 'భీమ్లా నాయక్' సినిమాలతో పోల్చితే 'ఆచార్య'కు షేర్ చాలా తక్కువ వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు రీసెంట్ గా 'ఆర్ఆర్ఆర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్ నటించాడు. టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే ఈ మెగా మల్టీస్టారర్ కి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావాలి. కానీ అది జరగలేదు. పైగా 'భీమ్లా నాయక్' సమయంలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్యకు హైక్ లభించింది.
ఆచార్య మొదటిరోజు నైజాంలో 7.90 కోట్ల షేర్ రాబట్టింది. ఇటీవల విడుదలైన కన్నడ మూవీ 'కేజీఎఫ్-2' 9.68 కోట్లతో నైజాం ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్-5 లో నిలిస్తే.. ఆచార్య టాప్-10 లో నిలవలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హైర్స్ తో కలిపి సీడెడ్ లో 4.60 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఆచార్య.. ఆంధ్రాలో 17 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 1.70 కోట్ల షేర్ వసూలు చేయగా.. ఓవర్సీస్ లో 3.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 35.05 కోట్ల షేర్(52 కోట్ల గ్రాస్) రాబట్టింది.
![]() |
![]() |