![]() |
![]() |

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసిన హీరోకి నెక్స్ట్ సినిమా ప్లాప్ పడుతుందని ఓ సెంటిమెంట్ ఉంది. తాజాగా ఆ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'తో సూపర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్.. తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య'తో నేడు ప్రేక్షకులను పలకరించాడు. కొరటాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రాజమౌళి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సినిమా బాగా తీయకుండా రాజమౌళి సెంటిమెంట్ రిపీట్ అంటే సరిపోతుందా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
'మిర్చి' సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు కొరటాల శివ. 'శంఖం' సినిమాని గుర్తు చేసే ఈ మూవీ.. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ కొరటాల ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. దాంతో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు కొరటాల. ఆ తర్వాత వచ్చిన 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచి కొరటాలను హ్యాట్రిక్ డైరెక్టర్ ని చేశాయి. ఆయన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా 'భరత్ అనే నేను' సినిమా వచ్చింది. 'లీడర్' మూవీని పోలినట్టు ఉండే ఈ సినిమా కూడా కొరటాలకు మరో విజయాన్ని అందించింది. అంటే మాములు కథలతోనే.. పవర్ ఫుల్ సీన్స్, డైలాగ్స్ రాసి తనదైన శైలిలో ప్రజెంట్ చేసి మెప్పిస్తుంటాడు కొరటాల. కానీ 'ఆచార్య'కి వచ్చేసరికి మాములు కథని, మరింత మాములుగా తెరకెక్కించి మొదటి పరాజయాన్ని చూశాడు.
నిజానికి కొరటాల మొదట చరణ్ తో సినిమా ప్లాన్ చేశాడు. కానీ చరణ్ కి 'ఆర్ఆర్ఆర్' మూవీ అవకాశం రావడంతో.. చిరంజీవి తెరపైకి వచ్చాడు. తనకోసం ఒక కథని రెడీ చేయమని చెప్పాడు. దాంతో కొరటాల 'ఆచార్య' కథని రెడీ చేశాడు. అందులో సిద్ధ పాత్రకి చరణ్ సరిపోతాడని భావించి.. చరణ్ కోసం ఆ పాత్రని పెంచుకుంటూ వెళ్లారు. అలా ఆర్టిఫిషియల్ గా రాసిన కథ కాబట్టే సోల్ లేకుండా పోయింది. స్టోరీ, స్క్రీన్ ప్లే పేలవంగా ఉన్నాయి. కొరటాల మార్క్ డైలాగ్స్, సన్నివేశాలు కరువయ్యాయి. మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే డైరెక్టర్స్ అదృష్టంగా భావిస్తుంటారు. కానీ కొరటాలకు ఏకంగా చిరు, చరణ్ లను కలిపి డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే కొరటాల ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఇద్దరు స్టార్స్ ని పెట్టుకొని ఇలాంటి సినిమా తీయడంపై మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ పోషించిన సిద్ధ పాత్ర కూడా ప్రస్తుతం అతని స్టార్ డమ్ కి సరిపోయేలా లేదు. 'ఆర్ఆర్ఆర్'లో రామరాజుగా చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు చరణ్. ఆ సినిమాతో అతని స్టార్ డమ్ డబుల్ అయింది. కానీ ఆచార్యలో సిద్ధ పాత్ర ఊహించినంత పవర్ ఫుల్ గా లేదు. యాక్టింగ్ కూడా ఆర్ఆర్ఆర్ స్థాయిలో లేదు. ఆ పాత్రని పవర్ ఫుల్ గా తీర్చిదిద్దడంతో పాటు, పూర్తి స్థాయిలో నటనను రాబట్టుకోవడంలో కూడా కొరటాల విఫలమయ్యాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొరటాల తాను చరణ్ కోసం రాసుకున్న కథతో సినిమా తీసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో గానీ.. చిరంజీవి చెప్పాడని కథ రాసి, సిద్ధ పాత్ర చరణ్ చేస్తున్నాడని మార్పులు చేసి మొత్తానికి మొదటి ప్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కొరటాల నెక్స్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో ఉంది. తారక్ కూడా 'ఆర్ఆర్ఆర్' తరువాత చేస్తున్న సినిమా కొరటాలదే కావడం విశేషం. మరి కొరటాల ఆ సినిమాతోనైనా విజయాన్ని అందుకొని రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |