![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవిని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాల్లో `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` ఒకటి. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సినిమా కోసమే తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. చిరంజీవికి జంటగా మాధవి నటించిన ఈ చిత్రంలో పూర్ణిమ, గొల్లపూడి మారుతీ రావు (నటుడిగా ఇదే మొదటి సినిమా), సంగీత, అన్నపూర్ణ, పి.ఎల్. నారాయణ, కాకినాడ శ్యామల, విజయలక్ష్మీ, జయశీల, గిరిజా రాణి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. కోడి రామకృష్ణ కథను అందించిన ఈ సినిమాకి గొల్లపూడి మారుతీ రావు సంభాషణలు సమకూర్చారు.
కథ విషయానికి వస్తే.. రాజశేఖరం (చిరంజీవి) ఓ సివిల్ ఇంజినీర్. జయలక్ష్మి (మాధవి)ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. అయితే, జయలక్ష్మిపై స్త్రీ లోలుడు అయిన సుబ్బారావు (గొల్లపూడి) కన్నేస్తాడు. ఈ క్రమంలో.. రాజశేఖరం, జయలక్ష్మి సంసారంలో సమస్యలు వస్తాయి. చివరికి వారిద్దరు ఎలా ఒక్కటయ్యారన్నదే `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` చిత్రం. ఇందులో చిట్టితల్లిగా పూర్ణిమ పాత్ర కూడా కీలకమే.
సి. నారాయణ రెడ్డి కలం నుంచి జాలు వారిన గీతాలకు జె.వి. రాఘవులు బాణీలు కట్టారు. ఇందులోని టైటిల్ సాంగ్ తో పాటు ``వచ్చే వచ్చే వాన జల్లు``, ``ఒక వనిత నవ ముదిత``, ``స్వామియే శరణం అయ్యప్ప``, ``సీతారాముల ఆదర్శం``, ``పలికేది వేద మంత్రం`` గీతాలు కూడా రంజింపజేశాయి. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించిన `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`.. తమిళంలో ``వీట్టుల రామన్ వెలియిల కృష్ణన్`, కన్నడంలో `మనెలి రామన్న బీధిల్లి కామన్న`, హిందీలో `ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్` పేర్లతో రీమేక్ అయింది. కాగా, 1982 ఏప్రిల్ 23న విడుదలై ఘనవిజయం సాధించిన `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |