![]() |
![]() |

బిగ్ బాస్ ఫెమ్ సోహెల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో రూపొందనున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'లక్కీ లక్ష్మణ్'. వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాతలు మిరియాల రవీంద్ర రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్ మరియు రాజా రవీంద్ర లు స్క్రిప్ట్ ను అందించగా.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో సోహైల్, హీరోయిన్ మోక్ష లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అప్పిరెడ్డి 'లక్కీ లక్ష్మణ్' మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో సోహెల్ మాట్లాడుతూ.. "చాలా మంది సొహైల్ సినిమా మీద సినిమా ఒప్పుకుంటున్నాడు ఏంటి అనుకోవచ్చు. అయితే నాకు కథ నచ్చితేనే సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాను. మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి లేడీ ప్రొడ్యూసర్ లు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు" అన్నారు.
చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. "దర్శకుడు అభి ఎంతో ట్యాలెండెడ్ పర్సన్. తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఎప్పుడూ సినిమా డైలాగ్స్ చెపుతూ కథలు డిస్కషన్ చేసేవాడు. తను పడే తపన చూసి నా రియల్ ఎస్టేట్ బిజినెస్ లను పక్కనపెట్టి సినిమా ఇండస్ట్రీతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా నీ కోసం నేనే సినిమా చేస్తాను మంచి కథ ఉంటే చెప్పామన్నాను. అభి చెప్పిన కథ ఫ్రెష్ గా అనిపించడంతో సినిమా నిర్మించే నిర్మాతకు ఎలాంటి బాధ్యతలు వుంటాయి, 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి ఇలా అన్ని విభాగాలను 6 మంత్స్ ఫుల్ స్టడీ చేసిన తరువాత నేను, నా ఫ్రెండ్ రమ్య ప్రభాకర్ లు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాము. ఈ సినిమాకు హీరోగా ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు. ఎంతో కష్టపడే సోహెల్ అయితే ఈ సినిమాకు కరెక్ట్ అని దర్శకుడు అభి చెప్పడంతో తనను హీరోగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేము అడిగిన వెంటనే మా కథ విని డీఓపీ అండ్రూ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, పాటల రచయిత భాస్కర పట్ల వంటి సీనియర్ టెక్నిషన్స్ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు" అన్నారు.
చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ.. "నేను చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. అయితే సొంతంగా ఒక సినిమా తీయాలని ఈ కథ రాసుకుని నిర్మాతలకు చెపుదాం అనుకున్నప్పుడు హరిత గోగినేని నాతో నీ దగ్గర మంచి కథ ఉంటే చెప్పామన్నారు. లక్కీ గా నేను చెప్పిన కథ తనక నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఆ తరువాత సోహెల్ కు ఈ కథ చెప్పగానే తను ఫస్ట్ సిట్టింగ్ లోనే చేయడానికి ఒప్పుకున్నాడు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా సీనియర్ టెక్నిషన్స్ ను తీసుకువచ్చారు. మంచి సబ్జెక్టు తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అన్నారు.
![]() |
![]() |