![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది మ్యాజికల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. వాటిలో `మేజర్ చంద్రకాంత్` ఒకటి. ఎన్టీఆర్ - రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రమిదే కావడం విశేషం. ఇందులో `మేజర్ చంద్రకాంత్`గా ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో మెస్మరైజ్ చేయగా.. సీనియర్ స్టార్ మోహన్ బాబు మరో హీరోగా అలరించారు. ఎన్టీఆర్ కి జోడీగా శారద, మోహన్ బాబుకి జంటగా నగ్మా, రమ్యకృష్ణ దర్శనమిచ్చిన ఈ సినిమాలో అమ్రిష్ పురి, బ్రహ్మానందం, బాబూ మోహన్, శ్రీహరి, సాయికుమార్, గుమ్మడి, పరుచూరి గోపాల కృష్ణ, బాలయ్య, చలపతి రావు, ప్రసాద్ బాబు, అచ్యుత్, అన్నపూర్ణ, సుధ, కిన్నెర, శిల్ప, శివపార్వతి, మాస్టర్ మంచు మనోజ్ కుమార్, బేబి శ్రేష్ఠ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన ఈ చిత్రానికి జాలాది, గురుచరణ్, రసరాజు, కీరవాణి సాహిత్యమందించారు. పాటల్లో ``పుణ్యభూమి నా దేశం`` ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలవగా.. ``సుఖీభవ సుమంగళి``, ``ఉలికిపడకు అల్లరి మొగుడా``, ``నీక్కావాల్సింది నా దగ్గరుంది``, ``లప్పమ్ టప్పమ్ గాళ్ళకి``, ``బుంగమూతి``, ``ముద్దుల్తో ఓనమాలు`` గీతాలు కూడా రంజింపజేశాయి. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన `మేజర్ చంద్రకాంత్`.. 1993 ఏప్రిల్ 23న విడుదలై ఆ యేటి మేటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 29 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |