![]() |
![]() |

'గరుడ వేగ' సినిమా కోసం రూ. 26 కోట్లు తీసుకొని ఎగ్గొట్టామంటూ జ్యోస్టార్ ఫిల్మ్ సర్వీసెస్ అధినేత కోటేశ్వరరాజు తమపై చేసిన ఆరోపణలను నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ ఖండించారు. అత్యుత్సాహంతోనో, లేక ఆయన ఇంకెవరి దగ్గరో తీసుకున్న అప్పులు తమ మీద రుద్దడానికో ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. రేపు కోర్టులో ఆయన ఏం ఆధారాలు చూపిస్తారో చూడాలనీ, ఆయన దగ్గర ఆధారాలంటే, తమ దగ్గర కూడా ఆధారాలున్నాయని ఆమె చెప్పారు.
శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, "నిజంగా అలాంటి దుర్మార్గులం, దుష్టులం అయితే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలా ఉండగలుగుతాం? ఒకవేళ నేను అలాంటి తప్పు చేసివున్నట్లయితే పోలీసులు, కోర్టులు ఎందుకు ఊరుకుంటారు? నేను తిరుగుతూనే ఉన్నాను కదా. నేనేమైనా దాక్కున్నానా? ఇది చాలా హర్టింగ్‌గా ఉంది. ఆ ప్రెస్‌మీట్ పెట్టినాయనేమైనా మహాత్ముడా? ఆయన చాలామందిని మోసం చేసివున్నారు. కంపెనీని తన భార్యపేరిట మార్చేసి, చెక్కులేవో వేసి డ్రామాలు ఆడుతున్నారు. అవన్నీ రేపు బయటకు వస్తాయి. కేసు కోర్టులో ఉన్నందున నేను ఆ విషయాల గురించి మాట్లాడకూడదు." అని చెప్పుకొచ్చారు జీవిత.
అంతకు ముందు శుక్రవారం 'గరుడ వేగ' నిర్మాణం కోసం వారి ఆస్తులను తాకట్టు పెట్టుకొని 26 కోట్లు అప్పుగా ఇచ్చానని తెలిపారు. అయితే అప్పు ఎగ్గొట్టి, తాకట్టు పెట్టిన ఆస్తులను బినామీ పేర్ల మీదకు మార్చుకొని దంపతులిద్దరూ తనను మోసం చేశారని ఆరోపించారు. వీరిపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు ఉన్నాయని, నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది అన్నారు. రాజశేఖర్ త్వరలో జైలుకెళ్లడం ఖాయం అని కోటేశ్వరరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నగరి కోర్టులో రెండు నెలలుగా ఈ కేసు నడుస్తున్న మాట, తమకు సమన్లు వచ్చిన మాట నిజమేనని జీవిత అంగీకరించారు. అయితే అరెస్ట్ వారెంట్ అందలేదని స్పష్టం చేశారు. తమ లాయర్లు కోర్టుకు హాజరయ్యారనీ, కోర్టు తీర్పు వచ్చాక ఎవరు తప్పు చేశారో, ఎవరిది మోసమో తేలుతుందన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదనీ, దేన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనీ జీవిత అన్నారు.
![]() |
![]() |