![]() |
![]() |

నటుడు ప్రభాకర రెడ్డి కేవలం అభినయానికే పరిమితం కాకుండా అటు రచయితగానూ, ఇటు దర్శకుడిగానూ అలరించారు. అలా రూపొందించిన చిత్రాల్లో `ప్రతిభావంతుడు` ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అభినేత్రి భానుప్రియ కథానాయికగా ఆకట్టుకున్నారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాలో గుమ్మడి, ప్రభాకర రెడ్డి, ప్రసాద్ బాబు, శ్రీధర్, అల్లు రామలింగయ్య, వేలు, షావుకారు జానకి, అన్నపూర్ణ, సంయుక్త, కె. విజయ, శుభ, జయమాలిని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
సత్యం సంగీతమందించిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ, సి. నారాయణ రెడ్డి, గోపి సాహిత్యమందించారు. ఇందులోని ``అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు`` (రెండు వెర్షన్స్) అంటూ సాగే పాట విశేషాదరణ పొందగా.. ``అది నేననుకున్నానా``, ``చూపుతో బాణమేసే``, ``చూస్తావా చూడరాని``, ``ఓయమ్మో ఎట్టా`` అంటూ మొదలయ్యే గీతాలు కూడా రంజింపజేశాయి. ఎస్.ఆర్. ఫిల్మ్స్ పతాకంపై ఎస్. రామచంద్రరావు నిర్మించిన `ప్రతిభావంతుడు`.. 1986 మే 16న విడుదలై చెప్పుకోదగ్గ విజయం సాధించింది. కాగా, నేటితో ఈ చిత్రం 36 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |