![]() |
![]() |

తెలుగునాట జానపద చిత్రాల్లో అలరించిన కథానాయకుల్లో నటరత్న నందమూరి తారక రామారావు ఒకరు. ఈ జానర్ లో ఎన్టీఆర్ అభినయించిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో `వీర కంకణం` ఒకటి. 1950లో విడుదలై విజయం సాధించిన తమిళ చిత్రం `మంత్రి కుమారి` (ఎమ్జీఆర్ కథానాయకుడు - ఎం. కరుణానిథి రచయిత) ఆధారంగా `వీర కంకణం` తెరకెక్కింది. జీఆర్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. మాతృకని నిర్మించిన మోడరన్ థియేటర్స్ అధినేత టి.ఆర్. సుందరంనే నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ తో పాటు కృష్ణకుమారి, జమున, జగ్గయ్య, రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, పేకేటి శివరామ్, గిరిజ, ఈవీ సరోజ ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఆరుద్ర మాటలు, పాటలు అందించారు.
సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో రూపొందిన గీతాల్లో ``కట్టండి వీరకంకణం``, ``హంస భలే రామ చిలక``, ``తేలి తేలి నా మనసు``, ``సొగసరి కులుకులు``, ``ఇక వాయించకోయి మురళి``, ``అందాల రాణి ఎందుకో గాని``, ``సిగ్గులు చిగురించెనే`` ఆకట్టుకున్నాయి. 1957 మే 16న విడుదలై ప్రజాదరణ పొందిన `వీర కంకణం`.. నేటితో 65 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |