![]() |
![]() |

కళాతపస్వి కె. విశ్వనాథ్ సినిమాలంటేనే అవార్డులకు చిరునామా. అలా.. పురస్కారాల పంట పండించిన చిత్రాల్లో `జీవన జ్యోతి` ఒకటి. నటభూషణ శోభన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కళాభినేత్రి వాణిశ్రీ తల్లీకూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేశారు. కైకాల సత్యనారాయణ, రాజబాబు, రంగనాథ్, రమోలా, రమాప్రభ, శుభ, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, అమోల్ పాలేకర్, బేబి వరలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. కె. రామలక్ష్మి కథను అందించిన ఈ చిత్రానికి కె. విశ్వనాథ్ స్క్రీన్ ప్లే, సముద్రాల సంభాషణలు సమకూర్చారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలు కట్టగా.. సి. నారాయణ రెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. ఇందులోని ``సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని``, ``ముద్దుల మా బాబు`` అంటూ మొదలయ్యే పాటలు విశేషాదరణ పొందగా.. ``ఎందుకంటే ఏమి చెప్పను``, ``ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో`` గీతాలు కూడా రంజింపజేశాయి. డీవీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై డీవీఎస్ రాజు నిర్మించిన `జీవన జ్యోతి`.. `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ కథా రచయిత` విభాగాల్లో `నంది` పురస్కారాలను - `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటుడు`, `ఉత్తమ నటి`, `ఉత్తమ దర్శకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. అలాగే, హిందీలో `సంజోగ్`, కన్నడలో `బలిన జ్యోతి` పేర్లతో రీమేక్ అయింది. 1975 మే 16న విడుదలై 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న `జీవన జ్యోతి`.. నేటితో 47 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |