![]() |
![]() |

కింగ్ నాగార్జున - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. మరీముఖ్యంగా.. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో చేసిన సినిమాలతో రెండు సార్లు `ఉత్తమ నటుడు`గా `నంది` పురస్కారాలు అందుకున్నారు నాగార్జున. `అన్నమయ్య` (1997) కోసం `ఉత్తమ నటుడు`గా కెరీర్ లోనే తొలిసారి `నంది` అందుకున్న నాగ్.. ఆపై `శ్రీరామదాసు` (2006) కోసం మరోసారి అదే బాట పట్టారు. ఈ రెండు సినిమాలు కూడా భక్తుల కథలతోనే తెరకెక్కడం విశేషం. కాగా, వీటిలో రెండో చిత్రమైన `శ్రీరామదాసు` విడుదలై నేటికి సరిగ్గా 16 ఏళ్ళు.
శ్రీరాముడి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) కథతో రూపొందిన ఈ బయోగ్రాఫికల్ ఫిల్మ్ లో నాగ్ టైటిల్ రోల్ లో కనిపించగా.. అతనికి జోడీగా స్నేహ అభినయించింది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కబీర్ దాస్ పాత్రలోనూ.. అందాల నటుడు సుమన్ శ్రీరాముడి వేషంలోనూ దర్శనమిచ్చారు. నాజర్, సుజాత, వేద, నాగబాబు, బ్రహ్మానందం, సునీల్, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఏవీయస్, అలీ, రఘుబాబు, విందు ధారా సింగ్, మాస్టర్ తేజ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
స్వరవాణి కీరవాణి బాణీలు, నేపథ్య సంగీతం `శ్రీరామదాసు`కి ప్రధానబలంగా నిలిచాయి. ఇందులోని పాటలన్నీ కూడా విశేషాదరణ పొందాయి. ఆదిత్య మూవీస్ పతాకంపై కొండా కృష్ణంరాజు నిర్మించిన `శ్రీరామదాసు`.. 67 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా నాలుగు `నంది` పురస్కారాలను, రెండు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకుంది. 2006 మార్చి 30న విడుదలై జననీరాజనాలు అందుకున్న `శ్రీరామదాసు`.. నేటితో 16 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |