![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లోని నటుడ్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రం `రంగస్థలం`. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ పిరియడ్ డ్రామాలో చిట్టిబాబు అనే చెవిటి యువకుడిగా దర్శనమిచ్చాడు చరణ్. అంతేకాదు.. తన అభినయానికిగానూ `ఉత్తమ నటుడు`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. రాజకీయాల నేపథ్యంలో 1980ల నాటి కథాఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా సమంత నటించగా ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ, రాజీవ్ కనకాల, నరేశ్, రోహిణి, పూజిత పొన్నాడ, బేబి యాని, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది.
చంద్రబోస్ కలం నుంచి జాలు వారిన గీతాలకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ``ఎంత సక్కగున్నవె``, ``రంగమ్మ మంగమ్మ``, ``రంగ రంగ స్థలాన``, ``ఆ గట్టునుంటావా``, ``జిగేల్ రాణి``, ``ఓరయ్యో``.. ఇలా ఇందులోని గీతాలన్ని కూడా విశేషాదరణ పొందాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన `రంగస్థలం`.. 2018 మార్చి 30న విడుదలై సంచలన విజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ నాలుగు వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |