![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా మెప్పించాయి. మరీముఖ్యంగా.. పవన్, డీఎస్పీ ఫస్ట్ కాంబోలో వచ్చిన `జల్సా` (2008) అయితే ఆడియో సేల్స్ పరంగా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అటు పవన్ కి, ఇటు దేవిశ్రీ కి కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా, పార్వతి మెల్టన్ నటించిన ఈ సినిమాలో కమలిని ముఖర్జీ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, శివాజీ, ముకేశ్ రిషి, సునీల్, అలీ, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, మల్లికార్జున రావు, రవి వర్మ, రవి ప్రకాశ్, కృష్ణుడు, ఉత్తేజ్, సత్యం రాజేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు అందించిన వాయిస్ ఓవర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దేవి శ్రీ ప్రసాద్ బాణీలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, రకీబ్ ఆలమ్ సాహిత్యమందించారు. టైటిల్ సాంగ్ తో పాటు ``గాల్లో తేలినట్టుందే``, ``మై హార్ట్ ఈజ్ బీటింగ్``, ``జెన్నీఫర్ లోఫెజ్``, ``యు అండ్ ఐ``, ``ఛలోరె ఛలోరె ఛల్`` ఇలా ఇందులోని పాటలన్నీ ఉర్రూతలూగించాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన `జల్సా`.. 2008 ఏప్రిల్ 2న విడుదలై మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఏప్రిల్ 2తో ఈ సినిమా 14 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |