'NTR 32'.. వెట్రిమారన్ దర్శకత్వంలో తారక్!
on Jun 20, 2022
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నాడు. తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో, తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న తారక్.. తాజాగా 32వ సినిమాకి కూడా గ్రీన్ ఇచ్చాడని తెలుస్తోంది. దీనికి కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడని టాక్.
'ఆడుగలం', 'విసరనై', 'వడా చెన్నై', 'అసురన్' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్.. ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డుని సైతం అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'విడుతలై', సూర్యతో 'వాడివాసల్' సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత తారక్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇటీవల తారక్ ని కలిసిన వెట్రిమారన్ ఓ కథని వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో తారక్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తారక్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. వెట్రిమారన్ కంటెంట్ కి తారక్ నటన తోడైతే సినిమా మరోస్థాయికి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే వీరి కాంబినేషన్ లో సినిమా అని న్యూస్ రాగానే తారక్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి.