'బిగ్ బాస్-6' కంటెస్టెంట్ గా 'వడ్డే నవీన్'!
on Jun 28, 2022
బిగ్ బాస్ హౌస్ లో టాలీవుడ్ కి చెందిన ఎందరో హీరోలు సందడి చేశారు. వీరిలో ఎక్కువగా అంతగా గుర్తింపు రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోయిన వాళ్ళో, లేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళో ఉన్నారు. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న వడ్డే నవీన్ బిగ్ బాస్-6 లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
'కోరుకున్న ప్రియుడు'(1997) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన నవీన్.. 'పెళ్లి', 'మనసిచ్చి చూడు', 'మా బాలాజీ', 'బాగున్నారా' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వరుస పరాజయాలు పలకరించడంతో 2010 లో వచ్చిన 'శ్రీమతి కళ్యాణం' తర్వాత సినిమాలకు బ్రేక్ పడింది. 'ఎటాక్'(2016) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. టీవీ షోలలో సైతం ఆయన కనిపించట్లేదు. 'ఆలీతో సరదాగా' షోకి ఆయనకు గెస్ట్ గా తీసుకురావాలని ఆడియన్స్ ఎప్పటినుంచో కోరుతున్నా అదీ జరగలేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారంటూ న్యూస్ వినిపిస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న 'బిగ్ బాస్-6' కోసం నవీన్ ని తీసుకొచ్చేందుకు షో నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఆయనను హౌస్ లోకి రప్పించడం కోసం భారీ రెమ్యూనరేషన్ కోసం ఆఫర్ చేశారట. ఈ షోకి రావడానికి మొదట నో చెప్పిన నవీన్, ఇప్పుడు కాస్త ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు నవీన్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉండేది. ఇప్పుడు నవీన్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడితే షోపై ఎందరో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగే అవకాశముంది.