గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్ పోతినేని!
on Jun 29, 2022
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత వరుస మాస్ సినిమాలలో నటిస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. గతేడాది 'రెడ్' సినిమాతో అలరించిన రామ్.. ఈ ఏడాది 'ది వారియర్'తో జులై 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మాస్ ఎంటర్టైనర్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో యాక్షన్ ఫిల్మ్ చేయనున్నాడు. ఇలా కొంతకాలంగా మాస్ జపం చేస్తున్న రామ్.. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్.. 'చెలి', 'ఘర్షణ', 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్', 'ఏ మాయ చేశావె' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇప్పటికే వెంకటేష్, నాగ చైతన్య, నాని వంటి తెలుగు హీరోలు ఆయన దర్శకత్వంలో సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల గౌతమ్ మీనన్, రామ్ మధ్య కథా చర్చలు జరిగాయని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదని న్యూస్ వినిపిస్తోంది. కాగా 2011 లోనే రామ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మరి ఇప్పుడైనా వీరి కాంబోలో మూవీ వస్తుందేమో చూడాలి.
దర్శకుడిగా గౌతమ్ మీనన్ విభిన్న జోనర్స్ లో సినిమాలు చేసినప్పటికీ ఆయన తెరకెక్కించే లవ్ స్టోరీలకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ప్రస్తుతం రామ్ ఏమో వరుస మాస్ సినిమాలు చేస్తున్నాడు. మరి వీరి కాంబినేషన్ నిజంగానే సెట్ అయితే ఎలాంటి జోనర్ లో సినిమా వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న 'ది వారియర్'తో తమిళ మార్కెట్ పై కన్నేసిన రామ్.. గౌతమ్ మీనన్ తో కూడా సినిమా చేస్తే అక్కడ తన మార్కెట్ రేంజ్ మరింత పెరిగే అవకాశముంది.