Home

»

Featured News

50 వేల‌కు పైగా పాట‌లు పాడిన పి.సుశీల‌.. గిన్నిస్‌బుక్ రికార్డు సాధించారు.. ఎందులోనో తెలుసా?

Nov 12, 2026 7:18PM

(నవంబర్ 13 నేపథ్య గాయని పి.సుశీల పుట్టినరోజు సందర్భంగా..)

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో మధురమైన గాత్రానికి చిరునామాగా నిలిచిన గాయని పి. సుశీల. తరాలు మారినా, సంగీతంలో కొత్త ప్రయోగాలు వచ్చినా ఆమె పాటలకు మాత్రం ఆదరణ తగ్గలేదు. భక్తి గీతమైనా, ప్రేమ పాటైనా, విరహ గీతమైనా.. ఏ తరహా పాటనైనా తనదైన స్వరంతో అద్భుతంగా ఆలపించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు పాటలతోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒడియా, సంస్కృతం, సింహళం, తుళు, బడగ భాషల్లోనూ తన గానమాధుర్యాన్ని పంచారు. దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడిన ఆమె, 17,695 సోలో పాటలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్నారు. ఐదుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా నిలిచిన సుశీలమ్మ ప్రయాణం నిజంగా ఎంతో ప్రత్యేకం.

పులపాక సుశీల 1935 నవంబర్ 13న విజయనగరంలో జన్మించారు. సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చే కుటుంబంలో పుట్టడంతో చిన్నతనం నుంచే ఆమెకు సంగీతంపై ఆసక్తి పెరిగింది. విజయనగరంలోని మహారాజా సంగీత కళాశాలలో ద్వారం వేంకటస్వామి నాయుడు ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో సంగీతంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా తొలుత తన గాత్రాన్ని వినిపించిన ఆమె, ఆ తర్వాత అప్పటి తెలుగు సినీ పరిశ్రమ కేంద్రంగా ఉన్న మద్రాసుకు చేరుకున్నారు. సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు ఆమె గాత్రంలోని ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించారు. పెండ్యాల సంగీతం అందించిన తమిళ చిత్రం ‘పెట్రతాయి’లో తొలిసారిగా పాట పాడారు. ఈ సినిమా తెలుగులో ‘కన్నతల్లి’ పేరుతో విడుదలైంది. ఇక ‘మిస్సమ్మ’ చిత్రంలో జమునకు పి. సుశీల నేపథ్యగానం అందించడం ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన మలుపు.

ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సుశీలమ్మకు వరుస అవకాశాలు వచ్చాయి. సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘చెంచులక్ష్మి’ చిత్రంలోని భక్తి గీతాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా’, ‘నారాయణ హరి నారాయణా’, ‘శ్రీనాథుని పద సరసిజ భజనే’ వంటి పాటలు ఇప్పటికీ భక్తులను అలరిస్తూనే ఉన్నాయి. కేవలం భక్తి పాటలకే పరిమితం కాకుండా ప్రేమ గీతాలు, విరహ గీతాలు, చిలిపి పాటలు, అల్లరి పాటలు ఇలా అన్ని రకాల పాటలతోనూ సంగీత ప్రియుల‌ను మెప్పించారు. కాలానికి తగ్గట్టుగా పాటలు పాడుతూ తన గాన ప్రస్థానాన్ని కొనసాగించారు.

ఇక అవార్డుల విషయానికి వస్తే పి.సుశీల సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. 1969లో తమిళ చిత్రం ‘ఉయర్నద మనిదన్’లోని ‘నాలై ఇంద వేళై పార్తు.. పాల్ పోలవే’ పాటకు తొలిసారి జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1971లో ‘సవాలే సమాలీ’ చిత్రంలోని పాటకు రెండోసారి జాతీయ అవార్డు దక్కింది. 1978లో తెలుగు చిత్రం ‘సిరిసిరిమువ్వ’లోని ‘ఝుమ్మంది నాదం’ పాటకు, 1982లో ‘మేఘసందేశం’లోని ‘ఆకులో ఆకునై’ పాటకు, 1983లో ‘ఎం.ఎల్.ఏ. ఏడుకొండలు’ చిత్రంలోని ‘ఎంత బీదవాడే’ పాటకు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇలా మొత్తం ఐదుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా నిలిచారు. 1977లో ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘ఏ తల్లి నిను కన్నదో’ పాటకు తొలి నంది అవార్డు అందుకోగా, మొత్తం ఏడుసార్లు నంది పురస్కారాలు ఆమెను వరించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు, కర్ణాటక ప్రభుత్వం నుంచి గానసరస్వతి బిరుదుతో పాటు 2008లో పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు.

ఒక గాయని తన జీవితకాలంలో ఎన్ని పాటలు పాడినా, వాటిలో కొన్ని మాత్రమే తరతరాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంటాయి. కానీ పి. సుశీలమ్మ విషయంలో అలాంటి మధుర గీతాలు ఎన్నో ఉన్నాయి. ఆమె గాత్రంలో పలికిన పాటలు ఇప్పటికీ రేడియోలోనూ, టీవీల్లోనూ వినిపిస్తూనే ఉంటాయి. కొత్త తరం గాయకులు వస్తున్నా, సంగీతంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నా సుశీలమ్మ పాటలకు ఉన్న ప్రత్యేకత మాత్రం చెక్కుచెదరలేదు. అందుకే ఆమెను కేవలం ఒక గాయనిగా కాకుండా తెలుగు సినీ సంగీత చరిత్రలో ఓ మధురమైన అధ్యాయంగా గుర్తుంచుకుంటారు.

 

 

[Psusheela, TeluguSongs, PsusheelaBirthday, TeluguOldSongs, Biography]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com