Home

»

Featured News

Ilaiyaraaja: ఇళయరాజా సృష్టించిన రికార్డులు.. ఒక్క రోజులోనే రీ-రికార్డింగ్, 5 జాతీయ అవార్డులు!

Jun 3, 2026 5:35PM

(జూన్ 3 ఇళ‌య‌రాజా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా..)

భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యానికి అప్రతిహత మహారాజు, ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రను 'ఇళయరాజాకు ముందు.. ఇళయరాజా తర్వాత' అని ఖచ్చితంగా విభజించవచ్చు. తన అద్భుతమైన స్వరాలతో, ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దాదాపు 5 ద‌శాబ్దాలుగా త‌న స్వ‌ర‌వాణి వినిపిస్తున్నారు ఇళ‌యరాజా. త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో 1540కి పైగా సినిమాల‌కు సంగీతం అందించారు అంటే ఆయ‌న పాట‌ల‌కు ఎన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. 

తమిళనాడులోని తేని జిల్లా పన్నైపురంలో 1943 జూన్ 3న ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఇళయరాజా. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. చిన్నతనం నుంచే సంగీతంపై విపరీతమైన మక్కువ పెంచుకున్నారాయన. తన అన్నగారైన పావలర్ వరదరాజన్ నేతృత్వంలోని సంగీత బృందంలో చేరి, ఊరూరా తిరుగుతూ వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఆ అనుభవమే ఆయన్ను మ‌ద్రాస్ వైపు నడిపించింది.

మద్రాస్‌కు వచ్చిన తర్వాత ప్రముఖ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ప్రొఫెసర్ ధనరాజ్ మాస్టర్ వద్ద పియానో, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ఆ తర్వాత లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి క్లాసికల్ గిటార్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ వద్ద అసిస్టెంట్‌గా చేరి దాదాపు 200 సినిమాలకు పనిచేశారు.

ఇళయరాజా ప్రతిభను గుర్తించి, ఆయనకు సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడు పంజు  అరుణాచలం. 1976లో వచ్చిన ‘అన్నకిలి’ అనే తమిళ చిత్రం ద్వారా ఇళయరాజా పరిచయమయ్యారు. ఈ సినిమాకు ఆయన అందించిన జానపద, శాస్త్రీయ సంగీత సమ్మేళనం ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమాలోని పాటలు ఊరు వాడ మారుమోగిపోయాయి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నారాయన.

ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ స్వర ప్రయాణంలో ఇళయరాజా సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. కేవలం పాటలే కాదు, సినిమాకు ప్రాణం పోసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లో ఆయనొక లెజెండ్. కేవలం ఒకే ఒక్క రోజులో ఒక సినిమాకు రీ-రికార్డింగ్ పూర్తి చేసిన రికార్డులు కూడా ఆయన సొంతం. 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'రుద్రవీణ', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'గీతాంజలి', 'అన్వేషణ' వంటి చిత్రాలకు ఆయన ఇచ్చిన సంగీతం తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఆయ‌న చేసిన సినిమాల్లో ఇవి మ‌చ్చుకు మాత్రమే. ఆయ‌న స్వ‌ర‌ప‌రిచిన సినిమాల పూర్తి వివ‌రాల‌ను ఇవ్వ‌డం అనేది సాహ‌సంతో కూడిన ప్ర‌య‌త్న‌మే అవుతుంది. ప్ర‌తి భాష‌లోనూ ఆయ‌న సూప‌ర్ డూప‌ర్ హిట్ సాంగ్స్ చేశారు. 

సంగీత ప్ర‌పంచానికి ఇళ‌య‌రాజా చేసిన సేవ‌ను గుర్తించిన భార‌త ప్ర‌భుత్వం.. దేశంలోని అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో గౌరవించింది. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా 5 జాతీయ అవార్డులను అందుకున్నారు. రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన సేవలు అందించారు.

ఇళయరాజా కేవలం ఒక సంగీత దర్శకుడు మాత్రమే కాదు, ఒక తరం భావోద్వేగం. సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా.. సగటు మనిషికి ఆయన పాట ఒక ఔషధంలా పనిచేస్తుంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంతో మంది సంగీత ద‌ర్శ‌కులు వ‌చ్చిన‌ప్పికీ ఇళ‌య‌రాజా శైలి వారంద‌రికీ విభిన్నం. ఆయ‌న త‌ర‌హాలో సంగీతం అందించిన సంగీత ద‌ర్శ‌కుడు మ‌రొక‌రు లేరు అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com