తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆయా సినిమాలను పదే పదే చూసేలా రూపొందించడంలో అప్పటి దర్శకులు ఎంత శ్రద్ధ పెట్టారో ఆ సినిమాలను చూస్తే మనకు అర్థమవుతుంది. టాలీవుడ్‌లో గొప్ప దర్శకులుగా పేరు తెచ్చుకున్న చాలా మంది డైరెక్టర్ల కెరీర్‌లో కొన్ని అపురూప చిత్రాలు ఉంటాయి. అవి నిజంగానే అపురూప చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. అలాంటి దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన రెండో సినిమా జ్యోతి అలాంటి జాబితాలోకే వస్తుంది. 1976 జూన్ 4న విడుదలైన ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కథానాయికగా నటించిన జయసుధ జ్యోతి చిత్రానికి సంబంధించిన కొన్ని మధుర స్మృతుల్ని నెమరు వేసుకున్నారు.
'మమతల కోవెల అనే నవల ఆధారంగా జ్యోతి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. నిర్మాత క్రాంతికుమార్ గారు నవలలు విపరీతంగా చదివేవారు. ఈ విషయంలో ఆయనకు పరిజ్ఞానం ఎక్కువ. అందుకే ఈ నవలను సినిమాగా తియ్యాలని భావించారు. అప్పటికి నేను శోభన్‌బాబుతో బాబు సినిమా చేశాను. నా రెండో సినిమా జ్యోతి. ఒక అద్భుతమైన కథతో ఈ సినిమాను 28 రోజుల్లో పూర్తి చేశాం. జ్యోతి పాత్ర పోషించిన జయసుధ ఎంతో చలాకీగా, మరెంతో గంభీరంగా నటించారు. సినిమాలో ప్రధానంగా ఉండే రాజయ్య పాత్రలో గుమ్మడిగారు ఎంతో అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు ఆయన జీవం పోశారని చెప్పాలి. అలాగే మురళీమోహన్‌గారు కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకోవడం, నా కెరీర్‌లోనే ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మా కుటుంబంలోని అందరికీ నచ్చింది.
సాధారణంగా సినిమాల్లో పాటల చిత్రీకరణకు కొరియోగ్రాఫర్ల అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ, జ్యోతి సినిమాలో ఉన్న నాలుగు పాటలకు ఎలాంటి కొరియోగ్రాఫర్ లేకుండా ఆ బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ఆ రోజుల్లో లొకేషన్ లో డైలాగ్స్ రికార్డ్ చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనందున, కేవలం ఒక టేప్ రికార్డర్ సహాయంతో డైలాగ్స్ అన్నింటినీ రికార్డ్ చేసి, నేరుగా డబ్బింగ్ థియేటర్‌కు తీసుకువెళ్లి సినిమాను పూర్తి చేశాం. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఒక గొప్ప కళాఖండంగా కొనియాడారు. ముఖ్యంగా విన్సెంట్ గారి అద్భుతమైన కెమెరా పనితనం, చక్రవర్తి గారి సంగీతం, మరియు సత్యానంద్ గారి సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచి, ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
జ్యోతి సినిమా సాధించిన ఘన విజయం నా సినీ జీవితంలోనే అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇప్పటికీ నేను నిర్వహించే డైరెక్షన్ క్లాసెస్‌లో ఒరిజినల్ లొకేషన్స్‌లో నాచురల్ లైటింగ్‌లో సీన్స్ ఎలా తీయాలనే విషయాలను వివరించడానికి జ్యోతి సినిమాలోని సన్నివేశాలనే ఉదాహరణగా చూపిస్తాను. యాభై ఏళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో జ్యోతి సినిమా గురించి గుర్తుచేసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అన్నారు.
ఈ యాభై ఏళ్ల ప్రయాణంలో ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఆ సినిమా నిలిచి ఉండటం, ఈ రోజు దాని గురించి మాట్లాడగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చేసే సమయానికి నా వయసు కేవలం 17 ఏళ్లు. అంత చిన్న వయసులోనే 'జ్యోతి' లాంటి ఎంతో పరిణతి, గాంభీర్యం ఉన్న ఒక సంక్లిష్టమైన, కఠినమైన పాత్రను చేయడం నిజంగా ఒక పెద్ద సవాలు. అయితే, 17 ఏళ్ల అమ్మాయి నుండి అంతటి అద్భుతమైన నటనను రాబట్టుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుగారికే ఆ క్రెడిట్ దక్కుతుంది. స్కూల్లో చిన్న పిల్లలకి పాఠాలు చెప్పినట్లు, ఎలాంటి భయమూ ఇబ్బందీ కలగకుండా ఎంతో సరదాగా నాతో ఈ సినిమా చేయించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్ మీద నా నటన చూసి నేనే కాదు, మా అమ్మానాన్న కూడా ఆశ్చర్యపోయారు' అని గుర్తు చేసుకున్నారు రాఘవేంద్రరావు.
సహజ నటి జయసుధ ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియజేస్తూ ‘ఈ చిత్రంలోని "సిరిమల్లె పువ్వల్లే నవ్వు" పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ హిట్ అనే విషయం మీకు తెలుసు. ఈ పాట వెనుక ఒక ఫన్నీ విషయం ఉంది. ఈ పాటలో ఎస్. జానకిగారి నవ్వుకు మ్యాచ్ చేస్తూ నేను కెమెరా ముందు నవ్వాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో నాకు అస్సలు నవ్వు వచ్చేది కాదు. దాంతో కెమెరా వెనుక చిత్ర యూనిట్ సభ్యులు కోతుల్లాగా ప్రవర్తిస్తూ, వింత వింత ముఖాలు పెడుతూ జోకులు వేస్తే తప్ప నాకు నవ్వు రాలేదు. అంతలా కష్టపడి ఆ నవ్వును రప్పించారు. కేవలం జ్యోతి మాత్రమే కాదు, రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో ఆమె కథ, ప్రేమలేఖలు, అమరదీపం వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నేను నటించాను.
ఈ క్లాసిక్ సినిమా నిర్మాణంలో మురళీమోహన్‌గారి అద్భుత నటన, గుమ్మడిగారు, సత్యనారాయణగారు, ఛాయాదేవిగారు వంటి దిగ్గజాల పాత్రలు మరువలేనివి. అలాగే టెక్నికల్‌గా విన్సెంట్‌గారి ఫోటోగ్రఫీ, అద్భుతమైన సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇలాంటి గొప్ప కథను నమ్మి, కమర్షియల్ లెక్కలు చూసుకోకుండా సినిమా తీసిన క్రాంతికుమార్‌గారు చాలా గొప్ప నిర్మాత. నాటి తరం అద్భుత సృష్టి అయిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ప్రస్తుత తరం యువత కూడా తప్పకుండా చూడాలి. వీలైతే ఈ సినిమాను కలరైజ్ చేసి నేటి జనరేషన్ ముందుకు తీసుకువస్తే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటూ తన మనసులోని మాటను తెలిపారు సహజనటి జయసుధ.




