Home

»

Featured News

హీరో కావాలని వచ్చారు.. ఆరు సార్లు అవకాశాలు చేజారినా చివ‌ర‌కు 650 సినిమాల్లో నటించిన గిరిబాబు.! 

Nov 16, 2026 4:15PM

సినిమా హీరో కావాలని ఎన్నో కలలు కన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరేడుసార్లు హీరోగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఒక సినిమాలో మీరే హీరో అంటూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ చివరకు ఆ సినిమాలన్నీ ఆగిపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సమస్యలు కూడా తోడయ్యాయి. కన్న తల్లిదండ్రుల నుంచి విడిపోయి, భార్యా పిల్లలతో ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా నటనపై ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. చివరకు హీరోగా కాకుండా విలన్‌గా మొదలైన ఆయన సినీ ప్రయాణం ఐదు దశాబ్దాల పాటు సాగింది. ఆయనే సీనియర్ నటుడు గిరిబాబు. ఇటీవల ఆయన కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది. ఆయన జీవితంలో ఎదురైన కష్టాలు, సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

గిరిబాబు అసలు పేరు య‌ర్రా శేష‌గిరిరావు. ప్రకాశం జిల్లా రావినూతల ఆయన స్వగ్రామం. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. చూడటానికి బాగుండటంతో స్నేహితులు కూడా ఆయనను సినిమా హీరో అని పిలిచేవారు. ఆ మాటలతో తనకు తానుగా హీరోనని ఊహించుకునేవారు. చదువు పూర్తయ్యాక 20 ఏళ్ల వయసులోనే శ్రీదేవితో వివాహం జరిగింది. కొన్నేళ్లకే ముగ్గురు పిల్లలకు తండ్రయ్యారు. తనలోని నటుడిని సంతృప్తి పరచడం కోసం మిత్రులతో కలిసి కళాపూర్ణ నాట్య మండలిని ప్రారంభించి నాటకాలు వేసేవారు. ఆ నాటకాల ఫొటోలు తీయడానికి వచ్చే ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావు ఆయన నటనను గుర్తించి, ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటుల కోసం ఇచ్చిన ప్రకటనకు ఫొటోలు పంపించారు. ఆ తర్వాత మరో ప్రకటనకు కూడా ఫొటోలు పంపడంతో మద్రాసు నుంచి పిలుపు వచ్చింది.

1967లో మద్రాసుకు వెళ్లిన గిరిబాబుకు ‘ధైర్య సాహసే లక్ష్మి’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ విషయం తెలిసి స్వగ్రామంలో బంధువులు, స్నేహితులు ఎంతో సంతోషించారు. కానీ నెల రోజులకే ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత జి.వరలక్ష్మి నిర్మిస్తున్న ‘మూగజీవులు’ సినిమా పూర్తయిన వెంటనే ‘తప్పటడుగులు’లో హీరోగా అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే ‘మూగజీవులు’ కూడా పట్టాలెక్కలేదు. మరోసారి ఎస్‌.డి.లాల్ దర్శకత్వంలో హీరోగా అవకాశం వచ్చినా, ఆ సినిమా కూడా ఆర్థిక సమస్యలతో మధ్యలోనే ఆగిపోయింది. ఇలా వరుసగా అవకాశాలు చేజారడంతో ఊరికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక అప్పులు చేయాల్సి వచ్చేది.

ఈ కష్టాల కారణంగా తల్లిదండ్రులతో కూడా విభేదాలు వచ్చాయి. చివరకు కుటుంబం నుంచి విడిపోయి తన వాటాగా వచ్చిన ఐదు ఎకరాల భూమితో భార్యాపిల్లలను పోషించుకోవాల్సి వచ్చింది. వ్యవసాయంపై పెద్దగా అవగాహన లేకపోవడం, సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడనే పేరుతో అప్పు కూడా పుట్టకపోవడంతో పరిస్థితి మరింత కష్టంగా మారింది. అలాంటి సమయంలో భార్య శ్రీదేవి ఆయనకు అండగా నిలిచారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భర్తకు ధైర్యం చెబుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇదే సమయంలో ఒకరోజు ఇంటి ముందు కూర్చున్న గిరిబాబు దగ్గరకు ఓ కోయదొర వచ్చి జాతకం చెబుతానన్నాడు. మొదట వద్దన్నా భార్య చెప్పడంతో చేయి చూసి, త్వరలోనే దక్షిణాదికి వెళ్తావని, నువ్వు అనుకున్నది జరుగుతుందని, భవనాలు కడతావని చెప్పాడు. నెల రోజుల్లో నీ జాతకం మారిపోతుందని కూడా అన్నాడు. 

ఇది కూడా చదవండి: ఆకాశంలో  ఒక తార వర్సెస్ డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు!

ఆ కోయదొర చెప్పిన 12 రోజులకే నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నుంచి పిలుపు వచ్చింది. హీరోగా ఎంపికయ్యానని చెప్పడంతో గిరిబాబు ఎంతో సంతోషించారు. కానీ మరుసటి రోజే హీరో పాత్రకు మరో వ్యక్తిని ఎంపిక చేశామని, విలన్‌గా నటిస్తారా అని అడిగారు. అప్పటికే చిన్న పాత్రైనా సరే నటించాలని నిర్ణయించుకున్న గిరిబాబు ఆ అవకాశాన్ని అంగీకరించారు. అలా 1973లో ‘జగమే మాయ’ సినిమాతో నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో హీరోగా ఎంపికైన వ్యక్తి మరెవరో కాదు.. తర్వాతి కాలంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్. ‘జగమే మాయ’లో గిరిబాబు నటనకు మంచి స్పందన రావడంతో సినిమా పూర్తయిన కొద్ది రోజులకే వరుసగా ఏడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక్కో నిర్మాత రూ.500 చొప్పున అడ్వాన్స్ ఇవ్వగా, అందులో కొంత తన ఖర్చులకు ఉంచుకొని మిగతా డబ్బును ఇంటికి పంపించారు. తన మొదటి సంపాదన చూసి తండ్రి కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని గిరిబాబు గతంలో చెప్పుకున్నారు.

అలా విలన్‌గా మొదలైన గిరిబాబు ప్రయాణం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా విస్తరించింది. దాదాపు 650 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఎన్నో పాత్రలు చేశారు. తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించారు. ‘దేవతలారా దీవించండి’, ‘సింహగర్జన’ వంటి చిత్రాలతో నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలను తెరకెక్కించారు. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయనకు మరో పెద్ద విషాదం ఎదురైంది. ఎన్నో కష్టాల్లో తనకు అండగా నిలిచిన భార్య శ్రీదేవి కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో 2016 మే 11న కన్నుమూశారు. ఆమె మరణం గిరిబాబుకు తీరని లోటుగా మిగిలింది. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, నటనపై ఉన్న ప్రేమతో చివరి వరకు సినిమాల్లో కొనసాగిన గిరిబాబు నవంబర్ 14న కన్నుమూశారు. ఆయన చివరి కోరిక మేరకు స్వగ్రామమైన రావినూతలలో అంత్యక్రియలు నిర్వహించారు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన జ్ఞాపకాలు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతాయి.

మీకు నచ్చవచ్చు: 

దక్షిణాది నుంచి తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దర్శకుడు ఎవరో తెలుసా?

ఒకప్పుడు ఆయన చేసింది ఆ వ్యాపారమే.. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు.?

 

 

 

 

[Giribabu, GiribabuLifeStory, TeluguActor, JagameMayaMovie, GiribabuStruggles]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com