Home

»

Featured News

హీరోగా మొదలై విలన్‌గా స్టార్‌డమ్.. గిరిబాబు ప్రస్థానం వెనుక ఆసక్తికర విషయాలు.!

Nov 14, 2026 3:49PM

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో గిరిబాబు ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తనదైన డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 600కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. అలాంటి గిరిబాబు నవంబర్ 14న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామానికి చెందిన ఆయనది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచే నాటకాలపై ఆసక్తి ఉండటంతో పాఠశాల రోజుల్లోనే పలు నాటకాల్లో నటించేవారు. సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసు వెళ్లారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లోనే నటుడు మోహన్‌బాబుతో కలిసి ఒకే గదిలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు 1973లో విడుదలైన 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'కురుక్షేత్రం', 'కరుణామయుడు' వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

కెరీర్ తొలినాళ్లలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన గిరిబాబు, ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా 1980, 1990 దశకాల్లో ఆయన పోషించిన విలన్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఆయన నటన విలన్ పాత్రలకే పరిమితం కాలేదు. హాస్యంతో కూడిన పాత్రలు, కుటుంబ పెద్ద పాత్రలు, రాజకీయ నాయకుడి పాత్రలు ఇలా ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్లలో మెప్పించారు. 'అతడు', 'గమ్యంస‌, ‘ఢమరుకం', 'గీత గోవిందం', 'సిసింద్రీ', 'జాతిరత్నాలు' వంటి సినిమాల్లోనూ నటించారు. ఒకవైపు అప్పటి అగ్ర హీరోలతో కలిసి నటిస్తూనే, మరోవైపు కొత్త తరం నటీనటులతోనూ తెరను పంచుకున్నారు. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేయడం ఆయన ప్రత్యేకత.

నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ గిరిబాబు నిర్మాణ రంగంపై కూడా ఆసక్తి చూపించారు. తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో జయభేరి ఆర్ట్ పిక్చర్స్ సంస్థను స్థాపించారు. 1977లో 'దేవతలారా దీవించండి' సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత 'సింహ గర్జన', 'ముద్దు ముచ్చట', 'సంధ్యారాగం', 'మెరుపు దాడి', 'ఇంద్రజిత్' వంటి సినిమాలను నిర్మించారు. వివిధ బ్యానర్లపై ఆయన నిర్మించిన సినిమాల సంఖ్య సుమారు పది వరకు ఉంటుంది. దర్శకత్వం మీద కూడా ఆసక్తితో మెగాఫోన్ పట్టారు. 'రణరంగం' (1985), 'ఇంద్రజిత్' (1990), 'నీ సుఖమే నే కోరుకున్నా' (2008) చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 'మెరుపు దాడి' సినిమాకు కథను అందించడం విశేషం.

సినిమాల ద్వారా సంపాదించిన గుర్తింపుతో పాటు సొంత ఊరికి ఏదైనా చేయాలనే తపన కూడా గిరిబాబులో ఉండేది. రావినూతల గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణం కోసం 1.25 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2008లో గ్రామంలో క్రీడా మైదానాన్ని కూడా నిర్మించారు. సినీ రంగానికి, సామాజిక సేవకు చేసిన కృషికి గుర్తింపుగా 2012లో అమెరికాలోని ఏఐఎం వెస్ట్‌బ్రూక్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆయన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ సాక్షి మీడియా గ్రూప్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన భార్య 2016లో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు రఘుబాబు, బోసుబాబు. తండ్రి బాటలోనే రఘుబాబు నటుడిగా, హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒక నటుడిగా మాత్రమే కాకుండా తనకు నచ్చిన కథలను నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ సినిమా పట్ల తనకున్న అభిరుచిని చాటుకున్న వ్యక్తి గిరిబాబు. హీరోగా మొదలైన ఆయన ప్రయాణం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో మలుపులు తిరిగింది. వందలాది సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయారు. తన నటనతో ఎన్నో తరాల ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. తెరపై ఆయన పోషించిన పాత్రలు, ఆయన అందించిన సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

 

 

[GiriBabu, GiriBabuDeath, GiriBabuMovies, GiriBabuFilmCareer, RaghuBabu]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com