- సినీ పరిశ్రమలో రారాజు అనిపించుకున్న కృష్ణంరాజు జీవితంలో చెరగని మచ్చ ఇదే..
- అసలు ఆ రచయితకి, కృష్ణంరాజుకి మధ్య ఏం జరిగింది?
ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు అనేవి సర్వ సాధారణం. తమ కెరీర్‌లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నవారు సైతం ఏదో ఒక సందర్భంలో కొన్ని వివాదాల బారిన పడతారు. కొన్ని అప్పటికప్పుడు సమసిపోతాయి. మరికొన్ని వారి మరణానంతరం కూడా చర్చనీయాంశంగా మారుతుంటాయి. అలాంటి ఓ వివాదం రెబల్‌స్టార్ కృష్ణంరాజు జీవితంలో ఉంది. అది ఎంతవరకు నిజం అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణంరాజు ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు తప్ప సోలో హీరో మాత్రం అవ్వలేకపోయారు. 60కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన తర్వాత 1974లో తనే సొంతంగా నిర్మించిన ‘కృష్ణవేణి’ చిత్రంతో మరోసారి హీరోగా ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ కృష్ణంరాజుకి హీరోగా ఆశించిన స్థాయిలో పేరు రాలేదు.
1976లో మళ్లీ తన సొంత నిర్మాణ సంస్థలోనే బాపు దర్శకత్వంలో చేసిన ‘భక్త కన్నప్ప’తో హీరోగా కృష్ణంరాజుకు మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సూపర్‌స్టార్ కృష్ణకు ‘అల్లూరి సీతారామరాజు’ ఎంత పేరు తెచ్చిందో.. ‘భక్త కన్నప్ప’ చిత్రం కృష్ణంరాజుకి అంతటి పేరు తీసుకొచ్చింది. కన్నప్ప పాత్రలో ఆయన్ని అద్భుతంగా చూపించడంలో బాపు పాత్ర ఎంత ఉందో, రచయిత ముళ్లపూడి వెంకటరమణ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సినిమా తర్వాత చేసిన చాలా సినిమాలు కృష్ణంరాజును హీరోగా ఒక స్థాయిలో నిలబెట్టాయి. అదే క్రమంలో వచ్చిన ‘కటకటాల రుద్రయ్య’ ఆయన్ని రెబల్‌స్టార్‌ని చేసింది. ఆ తర్వాత బాపు, రమణ కాంబినేషన్‌లోనే చేసిన ‘మనవూరి పాండవులు’ కృష్ణంరాజు కెరీర్‌లో మరో గొప్ప సినిమాగా నిలిచింది.
ఇదిలా ఉంటే.. ‘భక్త కన్నప్ప’ సినిమాకి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు కృష్ణంరాజు. దానికి ముళ్లపూడి హామీ సంతకం చేశారు. ఈ సినిమా విజయం సాధించి మంచి లాభాలు తెచ్చినప్పటికీ ఆ ఫైనాన్సియర్‌కి ఇవ్వాల్సిన మొతాన్ని కృష్ణంరాజు చెల్లించలేదు. మధ్యలో హామీ ఉన్నందుకు దానికి సంబంధించిన వడ్డీలు కూడా ముళ్లపూడి కట్టాల్సి వచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ డబ్బు గురించి కృష్ణంరాజు పట్టించుకోలేదు. దీంతో హామీగా ఉన్న ముళ్లపూడి ఇంటిని ఆ ఫైనాన్సియర్ తన పేర రాయించేసుకున్నారు. దాంతో తన మిత్రుడైన బాపు ఇంటిపైన ఉన్న పోర్షన్‌కి షిఫ్ట్ అయింది ముళ్లపూడి కుటుంబం.
విషయం అక్కడి వరకు రావడానికి కారణాలు ఏమిటి అనే విషయంలో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తను మధ్యలో ఉండి ఇప్పించిన డబ్బును ఎంత కాలమైనా తిరిగి చెల్లించకపోవడంతో అప్పటికి పరిశ్రమలో పెద్దగా వ్యవహరిస్తున్న డివిఎస్ రాజుకి ఈ విషయం గురించి చెప్పారు ముళ్లపూడి. అప్పుడాయన కృష్ణంరాజుకు ఫోన్ చేసి మందలించారని అంటారు. తమ మధ్య ఉన్న వ్యవహారాన్ని డివిఎస్ రాజుకు చెప్పడం వల్ల కృష్ణంరాజు హర్ట్ అయి అప్పు చెల్లించకుండా దాటవేస్తూ వచ్చారు. ఆ తర్వాత కొందరు సినీ పెద్దల దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు ముళ్లపూడి. కానీ, దాన్ని పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తన ఇంటిని ఆ ఫైనాన్సియర్‌కి రాసిచ్చెయ్యాల్సిన పరిస్థితి ముళ్లపూడికి వచ్చింది.
ఇదొక వెర్షన్ అయితే... ‘భక్త కన్నప్ప’ రిలీజ్ అయిన 9 సంవత్సరాల తర్వాత బాపు, రమణల కాంబినేషన్‌లోనే ‘బుల్లెట్’ అనే సినిమా చేశారు కృష్ణంరాజు. ఈ సినిమాకి ముళ్లపూడి వెంకరమణ నిర్మాత కాగా, కృష్ణంరాజు సమర్పకుడు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం ఉంటే కలిసి సినిమా చేయడం ఎలా సాధ్యమైంది అనేది కొందరి వాదన. ముళ్లపూడి ఇల్లు కోల్పోవడానికి మరేదైనా కారణం అయి ఉండవచ్చని, అందుకే పరిశ్రమలోని పెద్దలు కూడా ఆయన తరఫున మాట్లాడలేదని చెప్పుకుంటారు. అలా కృష్ణంరాజు, ముళ్లపూడి మధ్య వివాదం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.




