‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ యశ్.. ఇప్పుడు ‘రామాయణం’ సినిమాలో రావణుడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పౌరాణిక చిత్రంలో యశ్ లుక్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తెరపై ఎంతో రాజసం, గంభీరంగా కనిపించే రావణుడి పాత్ర వెనుక యశ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆయన ధరించిన దుస్తులు, ఆభరణాల బరువు గురించి తాజాగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
ఈ సినిమా కోసం యశ్ ధరించిన రావణుడి దుస్తుల్లో చాలావరకు 16 నుంచి 20 కిలోల బరువు ఉన్నాయట. ఇందులో దుస్తులతో పాటు ఆభరణాలు కూడా భాగమే. అయితే లంకకు సంబంధించిన రావణుడి లుక్, ఆయన వివాహ వేడుకల కోసం రూపొందించిన కాస్ట్యూమ్స్ మరింత భారీగా ఉన్నాయని కాస్ట్యూమ్ డిజైనర్ సానియా సర్దారియా వెల్లడించారు. కొన్ని ప్రత్యేకమైన దుస్తుల బరువు ఏకంగా 30 నుంచి 33 కిలోల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. దీంతో యశ్ ఈ పాత్ర కోసం ఎంతటి భారాన్ని మోయాల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక రావణుడి కిరీటం తయారీ కూడా చిత్ర బృందానికి పెద్ద సవాలుగా మారిందట. మొదట కిరీటం డిజైన్‌ను ఖరారు చేసేందుకు పలు 3డీ నమూనాలను తయారు చేశారు. ఆ తర్వాత దాని రూపం మారకుండా బరువును వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ చివరకు కిరీటం బరువు 1.8 కిలోలుగా నిలిచింది. తలపై అంత బరువును పెట్టుకుని నటించడం చాలా కష్టమని, కిరీటం ధరించినప్పుడు తల కదలికలు కూడా కొంత ఇబ్బందిగా మారేవని డిజైనర్ వివరించారు.
కేవలం కిరీటం మాత్రమే కాదు.. ఛాతీపై ధరించే కవచం, భుజాలపై ఉండే అలంకరణలు కూడా యశ్ కదలికలకు అడ్డంకిగా మారేవట. భారీ దుస్తులతో సహజంగా కదలడం, చేతులు పైకెత్తడం, తల తిప్పడం వంటి సన్నివేశాలు చేయడం అంత సులభం కాదు. అందుకే షూటింగ్ మధ్యలో కొన్ని ఆభరణాలు, దుస్తుల భాగాలను తొలగించేవారని సానియా తెలిపారు. యశ్‌కు వీలైనంత సౌకర్యంగా ఉండేలా దుస్తుల లోపలి భాగాలు, వాటి అమరికపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట.
ఇది కూడా చదవండి: 200 ఏళ్ల నాటి నవాబుల నగలు.. దీపావళికి కరీనా కపూర్ రాయల్ లుక్ వెనుక ఇంత కథ ఉందా?
ఇన్ని ఇబ్బందులు ఎదురైనా యశ్ మాత్రం షూటింగ్ సమయంలో సరదాగా ఉండేవారని డిజైనర్ గుర్తుచేసుకున్నారు. భారీ కాస్ట్యూమ్స్ వల్ల తాను పడుతున్న ఇబ్బందిని సరదాగా తీసుకుంటూ, కిరీటం, భుజాల అలంకరణల్లో ఉండే పదునైన భాగాలు ఇతరులకు కూడా తగిలేలా చేసి చిత్ర బృందాన్ని నవ్వించేవారట. అంతేకాదు.. ప్రతి కాస్ట్యూమ్ ట్రయల్ సమయంలో యశ్ కూడా తన సూచనలు ఇచ్చేవారని సానియా చెప్పారు. ఒక సన్నివేశంలో ఎలా కదలాలి, దుస్తుల అమరిక ఎలా ఉంటే సౌకర్యంగా ఉంటుందనే విషయాలను వివరించి డిజైనర్లతో కలిసి మార్పులు చేయించేవారట.
ఇక నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపిస్తున్నారు. రవీ దూబే లక్ష్మణుడి పాత్రలో, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో పాత్రల రూపకల్పన కోసం చిత్ర బృందం ఎంతటి శ్రద్ధ తీసుకుంటుందో యశ్ కాస్ట్యూమ్స్ వివరాలు చూస్తేనే అర్థమవుతోంది. మరి 33 కిలోల బరువున్న దుస్తులతో రావణుడిగా యశ్ తెరపై ఎలా కనిపిస్తారో చూడాలి.
మీకు నచ్చవచ్చు: 13 ఏళ్ల బంధానికి ముగింపు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసిన అన్నా కొణిదెల.!
[Yash Ravana Costume, Yash Ramayana Movie, Yash 33 Kg Costume, Yash Ravana Look, Ramayana Movie 2026, Yash Costume Designer, Saniya Sardhariya, Yash 1.8 Kg Crown, Ranbir Kapoor Ramayana, Sai Pallavi Sita, Nitesh Tiwari Ramayana, Yash Latest News]






