Home

»

Bollywood News

15 నిమిషాలు ఊపిరి బిగబట్టిన బాలీవుడ్ యాక్ష‌న్ హీరో.. అనుకరిస్తే ప్రాణాలకే ముప్పు.!

Oct 6, 2026 5:12PM

బాలీవుడ్ యాక్షన్ హీరో, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ మరోసారి తన ప్రత్యేకమైన శారీరక సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన ఏకంగా 15 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి ధ్యాన ముద్రలో కూర్చున్నారు. కళ్లు తెరిచే ఉంచి పూర్తిగా నిశ్చలంగా ఉన్న విద్యుత్.. ఈ విన్యాసంతో అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. ‘స్ట్రీట్ ఫైటర్’లో ధల్సిమ్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో తన పాత్రకు సంబంధించిన యోగ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఆయన ఈ డెమో ఇచ్చారు. 

ఈ ప్రదర్శన పూర్తయ్యాక విద్యుత్ జమ్వాల్.. తాను పతంజలి యోగసూత్రాల్లోని ఓ ప్రత్యేకమైన టెక్నిక్‌ను ఉపయోగించినట్లు చెప్పారు. ఈ సాధన తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించేందుకు ఉపయోగపడిందని, యువతకు కూడా ఈ పద్ధతిని నేర్పిస్తున్నానని తెలిపారు. నేటి తరం ప్రతిదీ సాధించాలనే తొందరలో నిరంతరం పరుగులు తీస్తోందని, కొంతసేపు ఆగి, ప్రశాంతంగా ఉండటం కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని సూచించారు. ఏదైనా సాధించాలంటే ఓపిక, ఏకాగ్రత అవసరమని తన అనుభవం ద్వారా చెప్పుకొచ్చారు.

అయితే విద్యుత్ చేసిన ఈ ప్రదర్శనను చూసి ఎవరూ ఇంటి దగ్గర ప్రయత్నించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శిక్షణ లేకుండా ఎక్కువసేపు ఊపిరి బిగబట్టడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల తల తిరగడం, గందరగోళం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చని, తీవ్రమైన సందర్భాల్లో మెదడుకు ఆక్సిజన్ అందక ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువసేపు ఊపిరి బిగబట్టేందుకు ముందుగా పదేపదే గట్టిగా శ్వాస తీసుకోవడం, అంటే హైపర్‌వెంటిలేషన్ చేయడం మరింత ప్రమాదకరమని సూచిస్తున్నారు. 

మరోవైపు విద్యుత్ జమ్వాల్ చేసిన ఈ ప్రదర్శన వెనుక సంవత్సరాల శిక్షణ, శ్వాస నియంత్రణ సాధన ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఆయన చేసినదాన్ని సాధారణ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌గా భావించి అనుకరించడం సరికాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, గతంలో స్పృహ కోల్పోయిన అనుభవం ఉన్నవారు ఇలాంటి కఠినమైన శ్వాస నియంత్రణ సాధనలను వైద్యుల సలహా లేకుండా చేయకూడదని సూచిస్తున్నారు. ‘స్ట్రీట్ ఫైటర్’తో ధల్సిమ్‌గా విద్యుత్ జమ్వాల్ హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 16న ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

 

 

[Vidyut Jammwal, Vidyut Jammwal Breath Holding, Vidyut Jammwal 15 Minutes, Street Fighter Movie, Vidyut Jammwal Dhalsim, Vidyut Jammwal Yoga, Breath Holding Risk, Hypoxia, Street Fighter Hollywood, Bollywood News, Vidyut Jammwal Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com