Home

»

Bollywood News

ఒకప్పుడు స్టార్ యాక్టర్.. రెండేళ్లుగా మంచానికే పరిమితం.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.!

Nov 18, 2026 5:29PM

ఒకప్పుడు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు.. ఇప్పుడు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మంచానికే పరిమితమయ్యారు. అవకాశాలు లేక, ఆరోగ్యం సహకరించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన.. చివరకు బాలీవుడ్ నటీనటులను సాయం కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ స్పందించి అండగా నిలిచారు. ఆ నటుడు మరెవరో కాదు.. షారుఖ్ ఖాన్ ‘జోష్’ సినిమాలో విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శరద్ కపూర్.

బాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీనటులు.. కాలం మారేకొద్దీ అవకాశాలు కోల్పోయి ఇబ్బందులు పడటం కొత్తేమీ కాదు. అయితే శరద్ కపూర్ పరిస్థితి మాత్రం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. గత రెండేళ్లుగా తాను పూర్తిగా మంచానికే పరిమితమయ్యానని ఆయన వెల్లడించారు.

శరద్ కపూర్‌కు మెదడుకు సంబంధించిన సమస్యతో పాటు కాలి గాయం కూడా ఉన్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సమస్యల కారణంగా ఆయన సాధారణ జీవితం గడపలేకపోయారని, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని సమాచారం. ఒకప్పుడు సినిమాల్లో చురుగ్గా కనిపించిన నటుడు.. ఇప్పుడు కనీసం తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి చేరుకోవడం అభిమానులను బాధిస్తోంది.

ఇటీవల ఆయన పెంచుకుంటున్న నాలుగు పెంపుడు కుక్కలను కూడా జంతు సంరక్షణ సంస్థకు అప్పగించాల్సి వచ్చింది. వాటిని చూసుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శరద్ కపూర్ పరిస్థితి వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ బర్త్‌డే ట్రీట్.. వంశీ, దిల్ రాజు ప్లాన్ ఇదే.!

తన పరిస్థితిని వివరిస్తూ శరద్ కపూర్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఆర్థికంగానే కాకుండా మానసికంగా, నైతికంగా కూడా సహాయం అవసరమని కోరారు. తనకు పని చేయాలని ఉందని, సినిమాలు, టీవీ, ఓటీటీ.. ఇలా ఏ అవకాశం వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఈ విజ్ఞప్తి తర్వాత పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు శరద్ కపూర్ వెల్లడించారు. ‘ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి’ అంటూ సల్మాన్ భరోసా ఇచ్చారట. అంతేకాదు, ఆయనకు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు నటుడు సోనూ సూద్ కూడా శరద్ కపూర్‌కు అండగా నిలిచారు. ఆయన కాలి గాయానికి చికిత్స అందించేందుకు వైద్యుల బృందాన్ని పంపించినట్లు సమాచారం. స్వయంగా శరద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. నటుడు రాహుల్ రాయ్ కూడా ఆయనను కలిసి ధైర్యం చెప్పారు.

అయితే ఈ కష్టకాలంలో కొందరు తన పరిస్థితిని సోషల్ మీడియా కంటెంట్‌గా మార్చుకుంటున్నారని శరద్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చేతిలో పెట్టి వీడియోలు తీసి, ఆ తర్వాత తిరిగి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. నిజంగా సాయం చేయాలనుకునేవారు తనను ఇబ్బంది పెట్టకుండా ఆదుకోవాలని కోరారు.

శరద్ కపూర్ 1996లో ‘దస్తక్’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘హథ్యార్’, ‘యే హై జల్వా’, ‘ఎల్‌ఓసీ కార్గిల్’, ‘లక్ష్య’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ నటించిన ‘జోష్’ సినిమాలో విలన్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ సినిమాలోనూ ఆయన కనిపించారు.

మీకు నచ్చవచ్చు:
రామాయణ ఎఫెక్ట్.. థియేటర్లలో కొత్త రూల్.. నాన్‌వెజ్‌ బ్యాన్.!
హైదరాబాద్‌లో ఐమాక్స్ రీఎంట్రీ.. ఫస్ట్ మూవీ ఇదే.! 

 

 

 

[Sharad Kapoor Health Condition, Sharad Kapoor, Salman Khan, Sonu Sood, Bollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com