
సినిమా థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే అందులోని సీన్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలైన సినిమాల్లో కీలక సన్నివేశాలను కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ విషయంలో మాత్రం మేకర్స్ చాలా సీరియస్ అయ్యారు. థియేటర్లలో సినిమా క్లిప్స్ రికార్డ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం: పార్ట్ 1’. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అధికారికంగా ఓ హెచ్చరిక జారీ చేసింది.
థియేటర్లలో అనుమతి లేకుండా సినిమా ఫుటేజ్‌ను రికార్డ్ చేయడం, వాటిని అప్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసినవారు వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. ఇకపై ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత అధికారులకు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ హెచ్చరికకు సంబంధించి మేకర్స్ బాంబే హైకోర్టు ఇచ్చిన రెండు ఆదేశాలను కూడా ప్రస్తావించారు. నవంబర్ 2, నవంబర్ 6 తేదీల్లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. అనుమతి లేకుండా సినిమా మొత్తాన్ని లేదా అందులోని ఏ భాగాన్నైనా రికార్డ్ చేయడం, అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలపై నిషేధం ఉంది.
ఇలాంటి చర్యలకు పాల్పడితే కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, ఐటీ చట్టం 2000 కింద క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేకర్స్ తమ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే క్రిమినల్, సివిల్ కేసులతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మొత్తానికి సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు.. అక్కడి అనుభూతిని ఆస్వాదించడమే కాకుండా, మొబైల్‌లో సీన్లు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టే అలవాటుకు దూరంగా ఉండాల్సిందే. లేదంటే సినిమా క్లిప్ షేర్ చేసినందుకు చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
[Ramayana Makers Legal Action, Ramayana Theatre Clip Leaks, Ramayana Makers Warning, Ramayana Piracy, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh Tiwari, Namit Malhotra]




