భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించారు. అయితే ఈ సినిమాలో సీత పాత్రను చూపించిన విధానం ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. ఇప్పటివరకు వెండితెరపై సీతాదేవి అంటే ఎంతో సహనశీలిగా, సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన త్యాగమూర్తిగా మాత్రమే ఎక్కువగా చూపించారు. కానీ ఈ సినిమాలో మాత్రం సీతాదేవిలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అవసరమైనప్పుడు ఆయుధం పట్టి శత్రువులతో పోరాడగల యోధురాలిగా సాయి పల్లవిని చూపించడం విశేషం.
ముఖ్యంగా దండకారణ్యంలో రాముడు, సీత వనవాసం చేస్తున్న సమయంలో రాక్షస సైన్యం ఎదురయ్యే ఘట్టంలో సీతాదేవి కూడా యుద్ధం చేయడం ఆసక్తికరంగా మారింది. రాక్షసులతో సీత స్వయంగా పోరాడే సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ మార్పుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాల్మీకి రామాయణంలో ఖరుడు, దూషణుడు తమ రాక్షస సైన్యంతో దాడి చేసినప్పుడు సీతాదేవిని సురక్షిత ప్రాంతంలో ఉండమని చెప్పి శ్రీరాముడు ఒంటరిగానే వారితో యుద్ధం చేస్తాడని కొందరు గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు సీత చేత యుద్ధం చేయించడం మూలకథకు భిన్నంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సీతలోని శక్తిసామర్థ్యాలను చూపించడం మంచి ప్రయత్నమని మరికొందరు సమర్థిస్తున్నారు.
ఈ వివాదంపై దర్శకుడు నితీష్ తివారీ గతంలోనే వివరణ ఇచ్చారు. సీతాదేవిని యోధురాలిగా చూపించడానికి ప్రాచీన గ్రంథమైన 'అద్భుత రామాయణం' నుంచి స్ఫూర్తి పొందినట్లు వెల్లడించారు. మన దేశంలో రామాయణానికి అనేక రూపాలు, పాఠాంతరాలు ఉన్నాయని, వాటిలో సీతాదేవిని యోధురాలిగా కూడా చిత్రించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా జనక మహారాజు కుమార్తెగా, క్షత్రియ వంశంలో పెరిగిన రాజకుమారిగా సీతలోనూ యుద్ధ నైపుణ్యాలు ఉండవచ్చనే కోణాన్ని సినిమాలో ఆవిష్కరించామని వివరించారు. అయితే శ్రీరాముడి పాత్ర విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా సంప్రదాయానికి అనుగుణంగా చూపించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.
ఇక 'అద్భుత రామాయణం'లో సీతాదేవి శక్తి స్వరూపిణిగా కనిపిస్తారు. ఈ గ్రంథంలోని కథనం ప్రకారం.. రావణుడి కంటే శక్తివంతుడైన సహస్ర రావణుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్న సమయంలో శ్రీరాముడు అతడి దాడికి స్పృహ కోల్పోతాడు. అప్పుడు సీతాదేవి మహాకాళి రూపాన్ని ధరించి ఆ రాక్షసుడిని సంహరిస్తారు. ఈ ఘట్టం సీతాదేవిలోని అపారమైన దైవిక శక్తిని తెలియజేస్తుంది. కేవలం రాముడిపై ఆధారపడే వ్యక్తిగా కాకుండా, అవసరమైనప్పుడు సమస్త లోకాలను రక్షించగల శక్తిస్వరూపిణిగా ఆమెను ఈ గ్రంథం ఆవిష్కరిస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమాలో సీతాదేవికి యాక్షన్ సన్నివేశాలను జోడించినట్లు దర్శకుడు వెల్లడించారు. అయితే అద్భుత రామాయణంలోని సహస్ర రావణుడి ఘట్టం, సినిమాలో చూపించిన ఖరదూషణుల యుద్ధ ఘట్టం రెండూ వేర్వేరు కథా సందర్భాలు కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: తెరపై కనిపించేది కొద్దిసేపే.. రావణుడి సింహాసనం వెనుక ఇంత కథ వుందా?
మరోవైపు సీతాదేవి పాత్ర కోసం సాయి పల్లవి కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు. తాను డ్యాన్సర్ కావడంతో కాళ్లకు మంచి బలం ఉందని, అయితే కత్తితో యుద్ధం చేసే సన్నివేశాల కోసం ప్రత్యేకంగా సాధన చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. స్టంట్ డైరెక్టర్లు ఈ పోరాట సన్నివేశాలను ఒక నృత్య ప్రదర్శనలా, రాజకుమారి తన కత్తులతో ఎంతో సునాయాసంగా కదులుతున్నట్లుగా రూపొందించేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ పాత్రను కేవలం ఒక నటనగా కాకుండా దైవం తనకు ఇచ్చిన వరంగా భావిస్తున్నట్లు కూడా సాయి పల్లవి గతంలో వెల్లడించారు.
ఇప్పటివరకు సీతాదేవి పాత్రలోని సహనం, త్యాగం, భక్తి, ధైర్యాన్ని మాత్రమే ఎక్కువగా వెండితెరపై చూసిన ప్రేక్షకులకు ఈ యోధురాలి కోణం కొత్త అనుభూతిని అందిస్తోంది. ముఖ్యంగా సాయి పల్లవి సహజమైన నటనకు, ఆమె డ్యాన్స్ నైపుణ్యాలకు ఈ యాక్షన్ సన్నివేశాలు తోడవడంతో పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే పౌరాణిక గాథలను తెరకెక్కించేటప్పుడు సృజనాత్మక స్వేచ్ఛకు ఎంతవరకు అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా ఈ సినిమాతో మరోసారి తెరపైకి వచ్చింది. మొత్తానికి సీతాదేవిని కేవలం త్యాగమూర్తిగానే కాకుండా శక్తిస్వరూపిణిగా, యోధురాలిగా చూపించిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది.
మీకు నచ్చవచ్చు: మంత్రించిన కాకులు.. భయంకరమైన గుహ.. ఓటీటీలో కొత్త సూపర్ నేచురల్ థ్రిల్లర్.!
[Sai Pallavi, Ramayana Movie, Sai Pallavi Warrior Sita, Nitesh Tiwari Ramayana, Adbhuta Ramayana, Sita Action Scenes, Ranbir Kapoor Ramayana, Warrior Goddess Sita, Telugu Movie News]





