Home

»

Bollywood News

26/11 కేసు హీరో ఉజ్వ‌ల్ నిక‌మ్ కథతో ‘ప్రహార్’.. ట్రైల‌ర్ ఎలా ఉందంటే.?

Sep 30, 2026 4:05PM

26/11 ముంబై దాడుల కేసు, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు, గుల్షన్ కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహాజన్ హత్య కేసు.. ఇవ‌న్నీ దేశాన్ని వ‌ణికించిన కేసులు. వీటిని వాదించిన ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ఉజ్వ‌ల్ నిక‌మ్ దేశ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 2016లో ఈయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించింది. అలాగే 2025లో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. ఆయ‌న వాదించిన కేసుల్లో 26/11 దాడుల కేసు ప్ర‌ముఖంగా నిలిచింది. ఈ కేసు నేప‌థ్యంతో తెర‌కెక్కిన సినిమా ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్‌లో రాజ్‌కుమార్ రావు ఉజ్వల్ నికమ్ పాత్రలో కనిపించారు. 26/11 దాడుల తర్వాత ఉగ్రవాది అజ్మల్ కసబ్‌పై జరిగిన విచారణ, కోర్టులో జరిగిన కీలక వాదనలు, కేసులో సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని నిందితుడిని చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం వంటి అంశాలు ట్రైలర్‌లో ప్రధానంగా చూపించారు. ముఖ్యంగా కసబ్ తాను మైనర్‌ అని చెప్పే అంశాన్ని నికమ్ ప్రశ్నించే సన్నివేశం ట్రైలర్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే.. సినిమా ట్రైలర్‌ను ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో విడుదల చేశారు. 26/11 దాడుల సమయంలో ఈ రైల్వే స్టేషన్ కూడా ఉగ్రవాదుల దాడికి గురైన ప్రాంతాల్లో ఒకటి కావడంతో, అదే ప్రదేశంలో ట్రైలర్‌ను విడుదల చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఉజ్వల్ నికమ్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

రాజ్‌కుమార్ రావుతో పాటు వామికా గబ్బి, జైదీప్ అహ్లావత్, సికందర్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అవినాష్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేశ్ విజన్ మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 26/11 కేసులో న్యాయపరమైన పోరాటంతో పాటు ఉజ్వల్ నికమ్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని కోణాలను కూడా సినిమాలో చూపించనున్నట్లు సమాచారం.

మరోవైపు.. 26/11 దాడుల కేసులో ఉజ్వల్ నికమ్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించి అజ్మల్ కసబ్ విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ కోర్టు పోరాటాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరించారన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా.. ‘ప్రహార్’ అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

 

 

[Prahaar Movie, Prahaar Trailer, Rajkummar Rao Prahaar, Ujjwal Nikam Biopic, Rajkummar Rao Ujjwal Nikam, 26/11 Mumbai Attacks Movie, Ajmal Kasab Trial, Wamiqa Gabbi, Jaideep Ahlawat, Avinash Arun, Maddock Films, Bollywood Movies 2026]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com