బాలీవుడ్‌లో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, సినిమాలు, సంబంధాలు, వివాదాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. 2004లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎన్నో సంచలన వ్యాఖ్యలు, సరదా సంభాషణలు, వివాదాలు, వైరల్ మూమెంట్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఈ షోకు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడబోతోంది. తొమ్మిదో సీజన్‌నే చివరి సీజన్‌గా కరణ్ జోహార్ ప్రకటించారు.
ఈ సందర్భంగా కరణ్ జోహార్ తన తండ్రి యశ్ జోహార్‌ను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 2004లో టాక్ షో చేయాలనే తన ఆలోచనను తండ్రితో పంచుకున్నానని, ఇద్దరు సెలబ్రిటీలను కూర్చోబెట్టి సరదాగా మాట్లాడించే కార్యక్రమం చేయాలనుకుంటున్నట్లు చెప్పినప్పుడు.. ‘నువ్వు నీ స్నేహితులతో మాట్లాడతావు కదా.. దానికి ఎవరు డబ్బులు ఇస్తారు?’ అని తన తండ్రి సరదాగా అడిగారని కరణ్ గుర్తుచేసుకున్నారు. అయితే షో ప్రారంభమైన అదే ఏడాది జూన్‌లో యశ్ జోహార్ కన్నుమూశారు. తండ్రితో తాను చర్చించిన చివరి ప్రాజెక్ట్ ఇదేనని కరణ్ తెలిపారు.
తన జీవితంలో ఈ షో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిందని కరణ్ చెప్పారు. ఈ కార్యక్రమం కారణంగా తనకు మంచి స్నేహాలు ఏర్పడ్డాయని, ఎన్నో సరదా సందర్భాలతో పాటు వివాదాలు కూడా ఎదురయ్యాయని పేర్కొన్నారు. షోపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రేక్షకుల ఆదరణ మాత్రం కొనసాగిందని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా తన తదుపరి సినిమా గురించి అడగడం కంటే ‘కాఫీ విత్ కరణ్’ తర్వాతి సీజన్ ఎప్పుడు వస్తుందని అభిమానులు అడిగేవారని కరణ్ చెప్పడం ఈ కార్యక్రమానికి ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.
ఇక ఈ పాపులర్ టాక్ షో చివరి సీజన్ అక్టోబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్‌లోనూ సెలబ్రిటీ గెస్టులతో కరణ్ చేసే సరదా సంభాషణలు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్లు, ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. 2004లో మొదలైన ‘కాఫీ విత్ కరణ్’ 22 ఏళ్ల తర్వాత ముగింపు పలుకుతుండటంతో బాలీవుడ్ అభిమానుల్లో ఈ చివరి సీజన్‌పై ఆసక్తి నెలకొంది.
[Koffee With Karan, Koffee With Karan Season 9, Karan Johar, Koffee With Karan Final Season, Koffee With Karan Ending, Karan Johar Emotional, Yash Johar, Koffee With Karan 2026, JioHotstar]




