Home

»

Bollywood News

అభిమానికి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో!

May 19, 2026

బాలీవుడ్ లో తనదైన నటనతో దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన సీనియర్ సూపర్ స్టార్ గోవిందా (Govinda) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన ఏదైనా కొత్త సినిమా అప్‌డేట్ వల్లో, లేక అవార్డుల వల్లో కాకుండా తన రియల్ లైఫ్ వ్యక్తిత్వం, పెద్ద మనసు కారణంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 

సాధారణంగా సినిమా తారలు బయటకు వచ్చినప్పుడు అభిమానులు వారిని చూడటానికి, వారితో సెల్ఫీలు దిగడానికి ఎగబడుతుంటారు. ఈ క్రమంలో సెలబ్రిటీల భద్రతను పర్యవేక్షించే బాడీగార్డ్స్ ఒక్కోసారి అతిగా ప్రవర్తిస్తూ అభిమానుల పట్ల దురుసుగా వ్యవహరించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా గోవిందా విషయంలో కూడా సరిగ్గా ఇలాంటి ఒక సంఘటనే జరిగింది, కానీ ఆ తర్వాత ఆయన స్పందించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంది.

ఇటీవల ఒక ఈవెంట్‌లో గోవిందాను చూసిన ఒక వీరాభిమాని ఆయనకు దగ్గరగా రావడానికి ప్రయత్నించాడు. అయితే, అక్కడ రక్షణగా ఉన్న గోవిందా వ్యక్తిగత బాడీగార్డ్స్ సదరు అభిమానిని, అలాగే అక్కడున్న మీడియా పర్సన్ ని చాలా బలంగా వెనక్కి తోసేశారు. ఆ తోపులాటలో అభిమాని కిందపడిపోయేంత పని అయింది. దీంతో వాతావరణం వేడెక్కి, గొడవకు దారితీసింది. వెంటనే గోవిందా తన బాడీగార్డ్స్ తరపున తాను క్షమాపణలు చెప్పి, వాతావరణాన్ని కూల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కొందరు స్టార్డమ్ తలకెక్కి అభిమానులను మనుషులుగా కూడా చూడని ఈ రోజుల్లో, ఇంత పెద్ద హీరో అయి ఉండి కూడా తన సిబ్బంది చేసిన పొరపాటును తన ఖాతాలో వేసుకుని క్షమాపణలు చెప్పడం నిజంగా అభినందనీయం అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  గోవిందా చూపిన ఈ పెద్దరికం చూసి బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com