Home

»

Bollywood News

రూ.37తో ముంబైకి.. ఇప్పుడు 550 సినిమాలు.. బాలీవుడ్ స్టార్ స‌క్సెస్ స్టోరీ.!

Oct 5, 2026 11:49AM

సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్‌గా ఎదగాలంటే ప్రతిభతో పాటు పట్టుదల, ఓపిక కూడా ఎంతో అవసరం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఒకరు. చిన్న వయసులోనే నటుడిగా ఎదగాలనే కలతో ముంబైకి వచ్చిన ఆయన చేతిలో ఉన్నది కేవలం రూ.37 మాత్రమే. కానీ గుండెల్లో మాత్రం ఆకాశమంత ఆశ ఉందని ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పారు.

1981లో షిమ్లా నుంచి ముంబైకి వచ్చిన అనుపమ్ ఖేర్‌కు తొలినాళ్లలో పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదు. ఓ నటన పాఠశాలలో ఉద్యోగం వస్తుందని నమ్మి ముంబైకి వెళ్లిన ఆయనకు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ పని వాయిదా పడిందనే విషయం తెలిసింది. చేతిలో డబ్బు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నలుగురితో కలిసి చిన్న గదిలో ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే నిద్రించాల్సిన పరిస్థితి కూడా ఎదురైందని ఆయన గతంలో గుర్తుచేసుకున్నారు. అయినా ముంబైలోనే ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగారు.

అయితే అనుపమ్ ఖేర్‌కు వచ్చిన మొదటి పెద్ద అవకాశం మాత్రం ఆయన కెరీర్‌నే మార్చేసింది. 1984లో వచ్చిన ‘సారాంశ్’ సినిమాలో 65 ఏళ్ల వృద్ధుడి పాత్రను, అప్పటికి కేవలం 27 ఏళ్ల వయసున్న అనుపమ్ ఖేర్ పోషించారు. ఈ పాత్రను చేయొద్దని కొందరు సూచించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. వయసుకు మించిన పాత్రలో నటించి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ తర్వాత హిందీతో పాటు పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక తన కెరీర్‌లో ఎన్నో అవమానాలు, తిరస్కారాలు ఎదురైనా వాటినే జీవిత పాఠాలుగా తీసుకున్నానని అనుపమ్ ఖేర్ చెబుతుంటారు. ఒక దశలో ఇంటి అద్దె చెల్లించలేక కుటుంబ సభ్యులతో కలిసి ఇబ్బందులు పడినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఓ నిర్మాత తనను డబ్బుల విషయంలో అవమానించిన సందర్భాన్ని, డబ్బుల్లేక బీచ్‌లో నిద్రించిన రోజులను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే కష్టాలు శాశ్వతం కావని, ‘కొంత‌కాలం మాత్ర‌మే అవి ఉంటాయ‌ని, అప్ప‌టివ‌ర‌కు ఓపికగా ఉండాలి’ అని తనకు తానే చెప్పుకునేవాడినని తెలిపారు.

నేడు అనుపమ్ ఖేర్ పేరు బాలీవుడ్‌లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. 550కుపైగా సినిమాల్లో నటించిన ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాలు దక్కాయి. ఒకప్పుడు జేబులో రూ.37తో ముంబైలో అడుగుపెట్టిన వ్యక్తి.. నేడు వందలాది సినిమాల అనుభవంతో నటుడిగా, గురువుగా, థియేటర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

 

 

[Anupam Kher, Anupam Kher Success Story, Anupam Kher 37 Rupees, Anupam Kher Struggle, Anupam Kher Biography, Anupam Kher Mumbai Journey, Anupam Kher Saaransh, Anupam Kher Movies, Bollywood Success Stories, Anupam Kher Life Story]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com