బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన ఆస్తిపాస్తుల గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. తనకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆస్తి ఉందంటూ ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతోందని, అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఆ మొత్తంలో కనీసం 10 శాతం కూడా తన దగ్గర లేదని ఆయన వెల్లడించారు. తన ఆస్తుల గురించి గూగుల్‌లో చూసి తానే ఆశ్చర్యపోయానని, ఈ తప్పుడు ప్రచారం వల్ల స్నేహితులు కూడా తనను డబ్బులు అడుగుతూ సరదాగా ఆటపట్టిస్తున్నారని చెప్పారు.
‘ది అన్‌ఫిల్టర్డ్ అవర్’ అనే యూట్యూబ్ కార్యక్రమంలో జర్నలిస్ట్ భారతి ప్రధాన్‌తో మాట్లాడిన అనుపమ్ ఖేర్.. తన జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గత పదేళ్లుగా తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నానని తెలిపారు. సొంత ఇల్లు ఉంటే దాని నిర్వహణ, ఆస్తికి సంబంధించిన ఒత్తిళ్లు ఉంటాయని, అద్దె ఇంట్లో ఉండటం వల్ల ఆ సమస్యల నుంచి స్వేచ్ఛ లభించిందని చెప్పారు. తన సోదరుడు కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని, ఇద్దరూ ఈ జీవన విధానంతో సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు.
గతంలో తనకు ముంబైలో ఓ ఇల్లు ఉండేదని, దాన్ని నటి అలియా భట్‌కు అమ్మేశానని అనుపమ్ ఖేర్ వెల్లడించారు. ఆ తర్వాత మరో ఇల్లు కొనకుండా అద్దెకు ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే తన తల్లి కోసం మాత్రం సిమ్లాలో ఓ ఇల్లు కొనుగోలు చేశానని తెలిపారు. తన తల్లి దాదాపు 60 ఏళ్ల పాటు అద్దె ఇంట్లోనే జీవించారని, సొంత ఇల్లు కావాలని కోరుకోవడంతో ఆమె కోసం ఇల్లు కొన్నట్లు వివరించారు.
అద్దె ఇంట్లో ఉంటున్నంత మాత్రాన తన జీవన ప్రమాణాలు తగ్గించుకోలేదని అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. మంచి రెస్టారెంట్లలో భోజనం చేయడం, సౌకర్యవంతంగా ప్రయాణించడం, లగ్జరీ హోటళ్లలో ఉండటం తనకు ఇష్టమని చెప్పారు. అయితే ఆస్తులు, డబ్బు సంపాదనకు అంతం ఉండదని, అవసరానికి మించి వస్తువులు కూడబెట్టుకోవడం తనకు ముఖ్యంగా అనిపించదని అన్నారు. సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన కంటే ప్రశాంతంగా జీవించడమే తనకు ముఖ్యమని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది.
Anupam Kher Net Worth, Anupam Kher 500 Crore Wealth, Anupam Kher Rented House, Anupam Kher Alia Bhatt House, Anupam Kher Interview, Anupam Kher Latest News, Anupam Kher Property





