బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) కార్యక్రమంలో ఓ సామాజిక కార్యకర్త చేస్తున్న సేవల గురించి తెలుసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆ వ్యక్తి నిస్వార్థ సేవను అభినందిస్తూ ఏకంగా రూ.21 లక్షల విరాళాన్ని అందించారు. ఈ సాయం కేబీసీ తరఫున కాకుండా అమితాబ్ తన వ్యక్తిగత ఖాతా నుంచి పంపడం విశేషం.
సిమ్లాకు చెందిన సర్బ్‌జీత్ సింగ్ బాబీ ‘ఆల్మైటీ బ్లెస్సింగ్స్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఇటీవల కేబీసీ వేదికపై ఆయనకు ‘ఫోర్స్ ఆఫ్ గుడ్’ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా తన సంస్థ ద్వారా చేస్తున్న సేవల గురించి అమితాబ్‌కు వివరించారు. ఆయన సేవలకు ముగ్ధుడైన అమితాబ్.. కార్యక్రమం తర్వాత ప్రశంసల లేఖతో పాటు రూ.21 లక్షల విరాళాన్ని పంపించారు.
సర్బ్‌జీత్ సింగ్ బృందం గత 12 ఏళ్లుగా సిమ్లాలోని ఆసుపత్రుల వద్ద రోగుల సహాయకులకు, పేదలకు ఉచితంగా భోజనం అందిస్తోంది. రోగులతో పాటు ఆసుపత్రులకు వచ్చే కుటుంబ సభ్యులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా ప్రతిరోజూ సుమారు 4 వేల మంది ఆకలి తీరుతోంది. అంతేకాకుండా, గత 28 ఏళ్లుగా ఎవరూ క్లెయిమ్ చేయని అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
ఇక రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలను కూడా ఈ సంస్థ చేపడుతోంది. అమితాబ్ అందించిన ఆర్థిక సాయంపై సర్బ్‌జీత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విరాళం తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ గుర్తింపు తన ఒక్కడిది కాదని, తనతో పాటు పనిచేస్తున్న వాలంటీర్లు, దాతలు, సహకరించిన ప్రతి ఒక్కరిదీ అని ఆయన తెలిపారు.
[AmitabhBachchan, AmitabhBachchanDonation, KBC, SarabjeetSinghBobby, AlmightyBlessings]




