బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాకు ‘ధురంధర్’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ.. ‘ధురంధర్’లో విలన్ పాత్రతో ఆయనకు మరోసారి భారీ క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా అక్షయ్ ఖన్నా ముంబైలో ఏకంగా రూ.33.26 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 2026లో జరిగినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వివరాలను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించాయి.
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్‌లోని 30 లిటిల్ గిబ్స్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. మొత్తం 2,516.84 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్‌లో 2,341.39 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో పాటు 175.45 చదరపు అడుగుల బాల్కనీ ఏరియా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాపర్టీతో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ ఫ్లాట్ కొనుగోలుకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ కూడా భారీగానే ఉంది. రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం అక్షయ్ ఖన్నా రూ.1.99 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించగా.. రిజిస్ట్రేషన్ ఛార్జీగా రూ.30 వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. మలబార్ హిల్ ప్రాంతానికి సముద్రం వైపు వ్యూ, మెరైన్ డ్రైవ్, నరీమన్ పాయింట్, కొలాబా వంటి ప్రముఖ ప్రాంతాలకు సమీపంలో ఉండటం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీంతో అక్కడి ప్రాపర్టీలకు భారీ డిమాండ్ ఉంటుంది.
దిగ్గజ నటుడు వినోద్ ఖన్నా కుమారుడైన అక్షయ్ ఖన్నా ‘దిల్ చాహ్తా హై’, ‘హమ్‌రాజ్’, ‘హుల్చుల్’, ‘గాంధీ మై ఫాదర్’, ‘రేస్’, ‘దృశ్యం’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో మెప్పించారు. ఇటీవల ‘ఛావా’, ‘ధురంధర్’ సినిమాల్లోనూ కనిపించారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ‘మహాకాళి’ సినిమాలో అసురగురువు శుక్రాచార్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్నట్లు సమాచారం.
[Akshaye Khanna New House, Akshaye Khanna New Apartment, Dhurandhar Akshaye Khanna, Akshaye Khanna Rs 33 Crore House, Malabar Hill Apartment, Akshaye Khanna Property, Dhurandhar Villain New House]




