బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్‌కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి నోటీసులు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో బీఎంసీ అధికారులు స్టాప్-వర్క్ నోటీసులు జారీ చేశారు. ఈ బంగ్లాను వాణిజ్య అవసరాలకు ఉపయోగించేందుకు జరుగుతున్న మార్పులే దీనికి కారణంగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. జుహులోని కపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అజయ్ దేవ్‌గణ్‌కు ఓ బంగ్లా ఉంది. సుమారు 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీలో అత్యాధునిక సెలూన్, స్పా ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే నివాస ప్రాంతంలో ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంపై హౌసింగ్ సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బంగ్లాలో సెలూన్, స్పా ప్రారంభమైతే బయట నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని, దాంతో పార్కింగ్, భద్రత, ట్రాఫిక్, శబ్దం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడి అంతర్గత రోడ్లు ఇరుకుగా ఉండటంతో అదనపు వాహనాల రాకపోకల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చని పేర్కొంటూ బీఎంసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదుపై బీఎంసీ కె-వెస్ట్ వార్డు అధికారులు స్పందించారు. అజయ్ దేవ్‌గణ్ బంగ్లాను తనిఖీ చేసిన అధికారులు అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన అనుమతులు, పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. అయితే వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన అవసరమైన అనుమతులు అందుబాటులో లేకపోవడంతో పనులను నిలిపివేయాలని బీఎంసీ స్టాప్-వర్క్ నోటీసు జారీ చేసింది.
అయితే ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు అజయ్ దేవ్‌గణ్ కుటుంబం నాలుగు వారాల సమయం కోరినట్లు సమాచారం. మరోవైపు స్థానిక కార్పొరేటర్ సుధా సింగ్ కూడా ఈ విషయంపై స్పందించారు. బీఎంసీ బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీ విభాగం నిర్వహించిన ప్రాథమిక తనిఖీల్లో ఆ ప్రాంగణానికి వాణిజ్య వినియోగానికి సంబంధించిన అనుమతులు లేవని అధికారులు గుర్తించినట్లు ఆమె తెలిపారు.
ప్రస్తుతం బీఎంసీ ఆదేశాలతో బంగ్లాలో జరుగుతున్న పనులు నిలిచిపోయాయి. అజయ్ దేవ్‌గణ్ కుటుంబం సమర్పించే వివరణ, పత్రాలను పరిశీలించిన తర్వాత అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో జుహులోని ఈ బంగ్లాలో ప్రతిపాదించిన సెలూన్, స్పా ప్రాజెక్ట్ విషయంలో చివరకు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
[Ajay Devgn, Ajay Devgn Juhu Bungalow, Ajay Devgn BMC Notice, Ajay Devgn Bungalow, BMC Stop Work Notice, Ajay Devgn Salon Spa, Ajay Devgn Latest News, Juhu Bungalow, Bollywood News, Mumbai BMC, Ajay Devgn Property, Ajay Devgn Mumbai Bungalow]





