English | Telugu
వసుధార ఇచ్చిన 'క్లూ' ని కనిపెట్టలేకపోయిన రిషి!
Updated : Feb 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ అత్యధిక టిఆర్పీతో దూసుకుపోతుంది. అయితే వసుధార మెడలో ఎవరు తాళి కట్టారోననే సస్పెన్స్ గత కొన్నిరోజులుగా సాగుతుంది. కాగా ఎంత ప్రయత్నించినా రిషి తెలుసుకోకపోగా.. అసలు నిజం దాస్తూ వసుధార పట్టుదలతో ఉంది. రోజుకో ట్విస్ట్ తో కథనం సాగుతుంది. ఎపిసోడ్ -687 లోకి అడుగు పెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. జగతిని తీసుకొని రిషి బయలుదేరుతాడు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని రిషి అడుగగా.. వసుధార ఇంటికి వెళ్తున్నామని జగతి చెప్తుంది. అక్కడికి అయితే నేను వచ్చేవాడిని కాదని రిషి తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి వసుధార ఉండే ఇల్లు వస్తుంది. ఇంటి ముందు రిషి కార్ అపి.. "మీరు వెళ్ళండి మేడం.. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను" అని అనడంతో జగతి ఒక్కతే లోపలికి వెళ్తుంది.
లోపలికి వెళ్ళిన జగతిని వసుధార చూస్తుంది. "రండి మేడం.. అది రిషి సర్ కార్ సౌండ్ లా ఉంది మేడం.. మహేంద్ర సర్, రిషి సర్ కార్ తీసుకొచ్చారా" అని వసుధార అడుగుతుంది. లేదు రిషీనే వచ్చాడని జగతి చెప్తుంది. మేడం ఇప్పుడే వస్తాను అంటూ.. రిషి దగ్గరికి వెళ్తుంది వసుధార. అలా బయటకు వస్తున్న వసుధారని రిషి చూస్తాడు. చూసి చూడనట్డుగా నటిస్తాడు. వసుధార వచ్చి లోపలికి రండి సర్ అని పిలుస్తుంది. అలా తను అనగానే.. నాకు తలనొప్పిగా ఉంది.. నిన్న నీకు వచ్చినట్లే ఈ రోజు నాకు తలనొప్పి వచ్చిందని రిషి అంటాడు. వసుధార కావాలనే కొంటెగా చూస్తూ.. "సర్ ఒకవేళ వస్తే 5 మినిట్స్ తర్వాత రండి" అని చెప్పేసి వసుధార వెళ్ళిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఎందుకు వాళ్ళ ఆయన్ని దాచేస్తుందా.. అని ఆవేశంగా లోపలికి వెళ్తాడు. లోపల అలా వెతుకుతుంటాడు. అది చూసి వసుధార నవ్వుతుంది. "సర్ మీకు కావలిసిన మనిషి లోపల గదిలో ఉన్నాడు" అని అనగానే.. రిషి ఆత్రంగా పరుగులు తీస్తాడు. కాని లోపలికి వెళ్లేసరికి ఎవరు ఉండరు. అద్దంలో తనకు తాను కనిపిస్తాడు. అదేంటి నాకు నేను కనిపిస్తున్న ఎవరు లేరేంటి? అని కోపంగా నన్ను పిచ్చివాణ్ణి చేస్తుందేంటి అని బయటికి వచ్చేస్తాడు. అక్కడే ఉన్న చక్రపాణి, జగతిలు ఆపే ప్రయత్నం చేసినా వినకుండా రిషి వెళ్ళిపోతాడు. ఇక జగతి కోపంతో, ఎందుకిలా చేస్తున్నావ్ వసుధార.. నిజం చెప్పేయొచ్చు కదా అని అంటుంది. లోపల అద్దం ఉంది మేడమ్. అందులో తను ఒక్కడే కన్పించినప్పుడు.. నేనేనా తన భర్తని అని కనిపెట్టొచ్చు కదా మేడం.. ఇక రిషి సర్ కనుక్కోలేడు కానీ నేనే నిజం తెలిసేలా చేస్తానని వసుధార చెప్తుంది.
వసుధార వాళ్ళ ఇంట్లో జరిగిందంత మహేంద్రకి చెప్తుంది జగతి. ఆ తర్వాత పదా.. వెళ్ళి వసుధారతో మాట్లాడదామని ఇద్దరు వెళ్తారు. మరోవైపు రిషి కోపంగా కాలేజీకి వెళ్తాడు. కాలేజీలో లైబ్రరీకి వెళ్ళి.. "లోపలికి ఎవరిని రానివ్వకు" అని ఆఫీస్ బాయ్ కి చెప్పగానే.. సరే సర్ మీకు ప్రశాంతత కావాలి .. అంతేగా అని లైబ్రరీ డోర్ వేసి వెళ్ళిపోతాడు. అప్పటికే లైబ్రరీలో వసుధార ఉంటుంది. అయితే ఆఫీస్ బాయ్ తనని చూడకుండా డోర్ వేస్తాడు. లోపల వసుధార ఉన్నట్లు రిషికి తెలియదు. రిషి ఉన్నట్లు వసుధారకు తెలియదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.