English | Telugu
'కార్తీకదీపం' కబుర్లు: మోనిత తన గొయ్యి తానే తవ్వుకుందా?
Updated : Jul 14, 2021
'కార్తీక దీపం'లో కథ కొత్త మలుపు తీసుకుంది. డాక్టర్ బాబు కార్తీక్, వంటలక్క దీపను విడదీయాలని మోనిత వేసిన పథకం ఆమె మెడకు చుట్టుకోబోతుందా? న్యాయం వైపు నిలబడే అధికారి ఏసీపీ రోషిణి దగ్గరకు వెళ్లి మోనిత తప్పు చేసిందా? తన గొయ్యి తానే తవ్వుకుందా? మంగళవారం ఎపిసోడ్ చూస్తే చాలామందికి అవునని అనిపిస్తోంది. అసలు, మంగళవారం ఏమైంది? అనే విషయంలోకి వెళితే...
కార్తీక్ తప్పు చేశాడని, తనను తల్లిని చేశాడని మోనిత చెప్పిన మాటలను వంటలక్క విశ్వసించదు. పైగా, గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపుతుంది. దాంతో ఆవేశంగా 'మీ అందరి అంతు చూస్తా' అంటూ అక్కడ నుంచి మోనిత నిష్క్రమిస్తుంది. ఏదో ఒకటి చేయాలని ఏసీపీ రోషిణి ఇంటికి వెళుతుంది. గతంలో దీప మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసింది ఆవిడే. కార్తీక్ స్నేహితురాలే మోనిత అని రోషిణి గుర్తు పడుతుంది. సమస్య ఏంటో చెప్పమని అడుగుతుంది.
తనకు అన్యాయం జరిగిందని, పెళ్లి కాకుండా తల్లిని అయ్యానని, అందుకు కారణం కార్తీక్ అని మోనిత ఏకరువు పెడుతుంది. సమాజం ఇటువంటి పని చేస్తే హర్షిస్తుందని అనుకుంటున్నారా? అని రోషిణి ప్రశ్నిస్తుంది. మోనిత చెప్పింది విన్నాక... 'స్నేహితుడిని ఇంటికి పిలిచి, మద్యం తాగడానికి అనుమతి ఇచ్చి, అతడి గదిలోకి మీరు వెళ్లి, ఏంటిది? స్నేహమే ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇప్పుడు మీ సమస్య ఏంటి?' అని రోషిణి అడుగుతుంది. ఇప్పుడు కార్తీక్ మొహం చాటేస్తున్నాడని, అతడి కుటుంబం తనను అవాయిడ్ చేస్తుందని, తన బిడ్డ అనాథలా పెరగడం తనకు ఇష్టం లేదని మోనిత కన్నీళ్లు పెట్టుకోవడంతో రోషిణి మనసు కరుగుతుంది. కార్తీక్, దీప ఇంటికి వెళుతుంది.
కార్తీక్ మీద మోనిత మీద కంప్లయింట్ ఇచ్చిందని రోషిణి చెప్పగా... దీపలో ఎటువంటి భయం కనిపించదు. ధైర్యంగా న్యాయం చేయమని కోరుతుంది. పదేళ్లలో జరగని తప్పు, తాను భర్తతో కలిసిన తర్వాతే ఎందుకు జరిగిందో తనకు అర్థం కావడం లేదని రోషిణికి అర్థమయ్యేలా దీప వివరిస్తుంది. దాంతో మోనిత తప్పు చేసిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో చాలామందిలో కలిగింది. అక్కడితో ఎపిసోడ్ కి ఎండ్ కార్డు వేశారు. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తి కలిగించారు. అయితే, మోనిత ఇచ్చిన కంప్లయింట్ ఆమె మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
