English | Telugu
కంటతడి పెట్టిన `కార్తీక దీపం` నటి
Updated : Dec 9, 2021
బుల్లితెరపై మహిళా లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `కార్తీక దీపం`. ఈ సీరియల్ ద్వారా వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. ఆ స్థాయిలో కాకపోయినా నటిగా పాపులారిటీని సొంతం చేసుకుంది మోనిత పాత్రలో నటించిన కన్నడ నటి శోభా శెట్టి. ఈ సిరియల్‌లో నెగిటివ్ పాత్రలో నటించి ఆకట్టుకుంటున్న శోభాశెట్టి జీవితంలోనూ చాలా బాధలు, కన్నీళ్లు.. వెక్కిరింపులు వున్నాయట.
ఇదే విషయాన్ని ఇటీవల ఓ టీవీ షోలో బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ ప్రదీప్ హోస్ట్‌గా జీ తెలుగులో నిర్వహిస్తున్న రియాలిటీ షో `సూపర్ క్వీన్`. వివిధ రంగాల్లో తమ ప్రతిభని చాటుకుని సాధారణ స్థాయి నుంచి అసాధారణ వ్యక్తులుగా ఎదిగిన మహిళల నేపథ్యంలో `సూపర్ క్వీన్` షోని నిర్వహిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న శోభాశెట్టి ఒక దశలో కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేని దీన స్థితిని ఎదుర్కొన్నానని, చెప్పులు తెగిపోతే పిన్నీసు పెట్టుకుని 20 కిలోమీటర్లు నడిచానని చెప్పి కన్నీళ్లు పెట్టుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. చెప్పులకు పిన్నీసు పెట్టి వున్న ఫొటోని డిస్‌ప్లే చేసి ఎంత మంది మీ చెప్పులకు పిన్నీసులు పెట్టి వాడారని అడిగాడు ప్రదీప్. దీంతో శోభా శెట్టి తన గతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ `నాకు బాగా గుర్తుంది నా రెండు షూస్ కి పిన్నీసులు పెట్టుకుని స్కూల్‌కి వెళ్లేదాన్ని.. అప్పుడు చెప్పులు కుట్టాలంటే మూడు నుంచి ఐదు రూపాయలు తీసుకునే వారు. ఆ టైమ్ లో ఆ డబ్బు కూడా మా దగ్గర లేదు. దాదాపు 20 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్లేదాన్ని ` అంటూ ఈ సందర్భంగా శోభా శెట్టి ఎమోషనల్ అయింది.