English | Telugu
ఇంటి ముందు అభిమానుల ధర్నా.. దెబ్బకి దిగొచ్చిన జ్యోతక్క!
Updated : Mar 5, 2023
తెలంగాణ యాసలో తీన్మార్ వార్తలు చదువుతూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు ఫుల్ బిజీ ఐపోయింది. బుల్లితెర ఈవెంట్స్ తో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. అప్పుడప్పుడు భర్తను కూడా తీసుకొచ్చి టీవీ షోస్ లో సందడి చేస్తూ కనిపిస్తోంది.
ఐతే ప్రస్తుతం ఆమె చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి.. లేటెస్ట్ గా 'జ్యోతక్క ముచ్చట్లు' అని కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ ఛానల్ లో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకుని జ్యోతక్క ఇంటి ముందుకు వచ్చి "డౌన్ డౌన్ జ్యోతక్క" అంటూ నినాదాలు చేశారు. ఇదంతా విని అసలేమైందో తెలుసుకోవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చింది. " ఎందుకు మా ఇంటి ముందుకొచ్చి లొల్లి పెడుతున్నారు" అని అడిగేసరికి " అబ్బా కమలహాసిని..ఏం తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నావక్కా...మీరు ఏది చేస్తే అది నడుస్తుందని...మా జనాలంటే అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా.. నువ్ చేసిన తప్పుకు సారీ చెప్పి నష్ట పరిహారం చెల్లించాలి...ఒక్క పూట అన్నం అన్నా తినను కానీ నీ వార్తలే చూస్తా... ప్రోగ్రాం స్టార్ట్ చేస్తావా చేయవా... ఏంటక్కా ఇలా చేసావ్.. నీ తెలంగాణ యాస వార్తలకు మా ఆంధ్రాలో చాలామంది ఫాన్స్ ఉన్నారు. మా అమ్మ సొంత బిడ్డలా చూసుకుంటుంది నిన్ను...." అంటూ గట్టి గట్టిగా అరిచేసరికి జ్యోతక్క అన్ని విని "ఇదంతా కాదు అత్తమ్మ ..నువ్వు చెప్పు ప్రోగ్రాం స్టార్ట్ చేయాలా వద్దా.." అని వాళ్ళ అత్తమ్మను అడిగింది. "చెయ్యి బిడ్డా..నువ్ వార్తలు చెప్తుంటే మంచిగుంటది" అని వాళ్ళ అత్తమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి "మీ అందరినీ చూస్తుంటే చాలా సంబరమైతాంది. అందుకే నేను మళ్ళీ తెలంగాణ యాసలో వార్తలు చెప్పడం షురూ చేస్తా త్వరలో" అని చెప్పింది జ్యోతక్క. ఇకపై తెలంగాణ యాసలో చెప్పే వార్తలన్నీ 'జ్యోతక్క ముచ్చట్లు' యూట్యూబ్ ఛానల్ లోనే అప్ లోడ్ చేయబోతోంది శివజ్యోతి.