Read more!

English | Telugu

Brahmamudi : ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను.. అనామికకి కనకం మాస్ వార్నింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-392 లో.. సీతారాముల కళ్యాణం జరింపించడానికి దుగ్గిరాల కుటుంబం అంతా కలసి గుడికి వెళ్తారు. అయితే రుద్రాణి మాస్టర్ ప్లాన్ తో అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు. దుగ్గిరాల వంశంలో చీమ చిట్టుక్కుమన్నా ప్రపంచం తెలుసుకుంటుంది. కానీ తొమ్మిది నెలల పాటు ఈ ఇంటి కోడలు కడుపుతో ఉన్న విషయం గానీ బాబు పుట్టిన విషయం గానీ ఎందుకు తెలియనివ్వలేదని ఓ రిపోర్టర్ అడుగుతుంది. అయితే దుగ్గిరాల కుటుంబంలోని ఎవరు నోరెత్తరు. అయిన మీడియావాళ్ళు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మీడియా ప్రశ్నలను తట్టుకోలేక.. రాజ్, కావ్య, ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్, ప్రకాశం, కళ్యాణ్.. ఇలా అంతా కంగారుపడుతుంటారు. రుద్రాణి, రాహుల్, అనామిక మాత్రం సంబరపడతారు.

నా కూతురికి జరిగిన అన్యాయం ఇప్పుడైనా బయటపెట్టేస్తే.. అప్పుడు నా కూతురికి న్యాయం జరుగుతుందేమో కదా అని కనకం భావించి.. అసలేం జరిగిందో నేను చెబుతానని రిపోర్టర్స్ తో అంటుంది. వెంటనే కావ్య.. అమ్మా నువ్వు ఆగు.. మాకు రాముడి కళ్యాణానికి టైమ్ అవుతోంది. మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కూర్చుంటే మాకు ఆలస్యం అవుతుంది.. తప్పుకోండి అను కావ్య అంటూనే రాజ్‌తో.. ఏమండీ రండి అంటూ మీడియాను తప్పించుకుని పూజ జరిగే వైపు వెళ్లిపోతుంది. దాంతో మీడియా రచ్చ కాస్త ఆగినట్లవుతుంది. ఇక కనకం, అప్పులను పక్కకి తీసుకెళ్తుంది కావ్య.  ఆ బాబు ఆయన బిడ్డ కాదు.. ఆయనేం తప్పు చేయలేదని కావ్య అంటుంది. నిజమా అని కనకం అనగానే.. అప్పుడే ఇందిరాదేవి వచ్చి.. అవును.. రాజ్ ఏ తప్పు చేయలేదు.. ఆ బాబు ఎవరి బాబో కనిపెట్టడానికే కావ్య ప్రయత్నిస్తుందని చెప్పగానే.. క్షమించండి అంటు కనకం అంటుంది. మరోవైపు పూజ చెయ్యాల్సింది నువ్వు, కళ్యాణ్ మాత్రమే.. ఆ అర్హత రాజ్‌కి లేదు.. వెళ్లి కళ్యాణం ఆపమని అనామికని రుద్రాణి బాగా రెచ్చగొట్టి పంపిస్తుంది. దాంతో అనామిక అక్కడికి వెళ్లి.. రాజ్, కావ్యలు పూజ చేయడానికి వీల్లేదు. రాముడు ఏకపత్నీవ్రతుడు.. మరి భార్య ఉండగా మరో ఆడదానితో బిడ్డను కని, తీసుకొచ్చిన బావగారికి ఆ అర్హతెక్కడుందంటు అనామిక ప్రశ్నిస్తుంది. స్వప్న మధ్యలో అందుకొని.. నిన్ను నేను కొబ్బరి బొండంతో కొట్టానంటే.. నీ తల ఏదో.. కొబ్బరి బొండం ఏదో తెలియకుండా కొబ్బరి చట్నీ అయిపోతుందంటూ అనామికని స్వప్న తిడుతుంది. ఆ తర్వాత ఇద్దరిని అపర్ణ ఆపేస్తుంది. 

అయిన అనామిక పంతం వదలకపోయేసరికి కనకం రంగంలోకి దిగుతుంది. ఏందమ్మా నువ్వు అడ్డుకునేది? ఇందాకటి నుంచి చూస్తున్నాను.. అత్తలేదు..మామలేదు.. మొగుడు లేడు.. పెద్దలు ఇంతమంది ఉన్నారు.. నిన్న కాక మొన్న ఉడతలాగా ఊడిపడిన దానివి నువ్వు మాట్లాడుతున్నావేంటీ? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? మా అల్లుడు ఇంకో భార్యను చూశావా? లేదంటే నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించావా? ఫొటోలేవి.. సాక్ష్యాలేవి.. సాక్షులేరి.. తీసుకునిరా.. అసలే ఏం జరిగిందో దాని వెనుకున్న నిజాలేంటో ఇక్కడున్న ఎవరికైనా తెలుసా? ఇప్పటి వరకూ ఆ బిడ్డ తల్లి ఎలా ఉంటుందో ఇక్కడున్న జీవి ఎవరైనా చూశారా? నువ్వు ఎంత..? నీ వయసెంత? నీ లెక్క ఎంత? ఈ కళ్యాణం జరిపించేది నా కూతురు అల్లుడే.. ఏం చేసుకుంటావో చేసుకో వెళ్లు అని అనామికపై కనకం అరుస్తుంది. ఇక ఇందిరాదేవి.. రాజ్, కావ్య.. మీరు పట్టు వస్త్రాలు సమర్పించండి అని అంటుంది. 

అది చూసి అనామిక.. అమ్మమ్మగారు అని అరుస్తుంది. వెంటనే అనామిక ముందుకు ఇందిరాదేవి వచ్చి.. ఇంకొక్క మాట మాట్లాడితే లాగిపెట్టి ఒక్కటిస్తాను. మీ అత్తకోడళ్లకు వేరే పనేం లేదా?’ అంటుంది ఇందిరాదేవి. మీ అత్తకోడళ్లు.. ఇంట్లో చేసే రబస చాలదా? దేవుడి కళ్యాణంలో కూడా మీ కుళ్లుబుద్ధి చూపించుకోవాలా? నోరు ఎత్తావంటే మర్యాద దక్కదు.. కళ్యాణం ప్రశాంతంగా జరకుండా ఎవరు ఎవరు అడ్డుపడతారో వాళ్లందరినీ తిరిగి ఇంటి గడపలోనే అడుగు పెట్టనివ్వనంటూ ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. ఇక అనామిక, ధాన్యలక్ష్మి మౌనంగా ఉంటారు. రాజ్, కావ్య చేతులమీదుగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.