English | Telugu

బిగ్‌బాస్‌ శివజ్యోతి కొత్త ఇల్లు ఎలా ఉందో చూశారా?

ఓ న్యూస్‌ ఛానల్‌లో సావిత్రిగా తీన్మార్‌ వార్తలతో అందర్నీ అలరించిన శివజ్యోతి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. టాప్‌ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచిన శివజ్యోతి ఈమధ్య సొంతంగా ఒక యూ ట్యూబ్‌ ఛానల్‌ని కూడా ప్రారంభించింది. గంగులు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్ళి పెద్దవారికి నచ్చకపోవడంతో ఇంటినుంచి బయటకు వచ్చేశామని గతంలోనే చెప్పింది శివజ్యోతి.

ఇటీవల శివజ్యోతి తమ నూతన గృహ ప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో చూపించిన దాన్ని బట్టి అది గేటెడ్‌ కమ్యూనిటీలోని ఓ ఖరీదైన ఫ్లాట్‌గా అర్థమవుతోంది. గతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన ఆమె కొంతకాలానికే ఆ ఇంటిని అమ్మేసింది. ఇప్పుడు సకల సౌకర్యాలతో కూడిన కొత్త ఫ్లాట్‌లోకి అడుగుపెట్టింది. శివజ్యోతి నూతన గృహ ప్రవేశానికి బుల్లితెర నటీనటులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరై శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గృహ ప్రవేశానికి హాజరైన అతిథులను అద్భుతమైన వంటకాలతో సత్కరించారు శివజ్యోతి దంపతులు.