English | Telugu

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కోసం 'పటాస్' షో వదిలేశా!

బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో షోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. అత‌నికి క్రేజ్ తీసుకొచ్చిన షోలలో 'పటాస్' ఒకటి. ఇలాంటి షో నుండి రవి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే విషయంపై రవి క్లారిటీ ఇచ్చాడు. 'పటాస్' షో నుండి బయటకి వచ్చినప్పుడు చాలా బాధ కలిగిందని.. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి ఆ షోని తీర్చిదిద్దామని అన్నాడు. జీవితం కంటే ఎక్కువగా ప్రేమించిన అలాంటి షోను విడిచిపెట్టడం కాస్త జీర్ణించుకోలేని విషయమంటూ చెప్పుకొచ్చాడు.

కెరీర్ ఆరంభంలో 'సమ్ థింగ్ స్పెషల్' డైలీ షో దాదాపు నాలుగు సంవత్సరాల్లో 900 ఎపిసోడ్ లు చేశానన్నాడు. ఇక ఆ సమయంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సమయం ఉండేది కాదని అలాగే 'పటాస్' షో కూడా తన జీవితంలో భాగంగా మారిందని తెలిపాడు. అయితే 'పటాస్' షోలో ఉన్నప్పుడే తనకు పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం వచ్చిందని.. అప్పుడు ఆ షో కంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ నచ్చడంతో 'పటాస్' షోను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

కెరీర్ విషయంలో ఎవరైనా మరో లెవెల్ కి వెళ్లాలని కోరుకుంటారని.. అందుకే సినిమా ఆఫర్ కోసం 'పటాస్' షో వదులుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ షోలో పంచ్ లు రెగ్యులర్ గా మారాయని.. కొత్తగా ఏమీ ఉండడం లేదనే మాటలు వినిపించాయని రవి అన్నాడు. దాంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్లీ ఫ్రెష్ గా వద్దామని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు.