English | Telugu
రెండో జీవితాన్ని ఇచ్చింది బిగ్ బాస్!
Updated : Dec 31, 2022
"హాయ్.. హలో చిత్తూర్.. నాయనా మీ అభిమానం సల్లంగుండా" అంటూ గీతూ రాయల్ తనదైన యాసలో చెప్పి చిత్తూరు ప్రజల మనసు దోచుకుంది. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో తానా వారి చైతన్య స్రవంతి కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అక్కడికి వచ్చిన యూత్ అంతా గీతూతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.
ఇంతలో గీతూ స్టేజి మీదకి వెళ్లి "మీ అభిమానానికి నేను ఫిదా ఐపోయాను.. నాకు మాటలు కూడా రావడం లేదురా నాయనా.. నేను చిత్తూర్ నుంచి బయటికి వెళ్ళిపోయి దాదాపు 15 ఏళ్ళు ఐపోతోంది.. ఐనా కూడా నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు.ఇక్కడి చిత్తూరు యాసను నా రక్తంలోకి ఎక్కించేసుకున్నా. ఎక్కడైనా, ఎప్పుడైనా చిత్తూరు యాసలోనే నేను మాట్లాడతా.. ఏ ఊరు అని నన్ను ఎవరైనా అడిగితే చిత్తూర్ అని గర్వంగా చెప్పుకుంటా" అంది గీతూ రాయల్.
బిగ్ బాస్ తనకు మరో జీవితాన్ని ఇచ్చిందని అక్కడ రెండు విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. "ఎలాంటి పరిస్థితికైనా ఎదురు నిలవాలి. తప్పు మన వైపు ఉంటే గనక చిన్నపిల్లాడికైనా సారీ చెప్పాలి" అంది గీతూ. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తనకు ఓటు వేసిన అందరికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆమెకు శాలువా కప్పి మెమెంటో ఇచ్చి సత్కరించారు.